శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం జిల్లావ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. వివాహ వేదికలు, చలువ పందిళ్లతో గుళ్లు, గోపురాలు కళకళలాడుతున్నాయి. అపరభద్రాద్రిగా ఖ్యాతిగాంచిన ఇల్లందకుంట రామాలయంతో పాటు వేములవాడలోని రాజన్న సన్నిధానం వేడుకలకు ముస్తాబయ్యాయి. రాజన్న సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని (తలువాలు) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షకుపైగా పైగా భక్తులు తరలిరానున్నారు.
వేములవాడ టౌన్/ఇల్లందకుంట, మార్చి 29: శ్రీరాముడు జన్మించిన నవమి నాడే కల్యాణాన్ని జరపడం సంప్రదాయంగా వస్తున్నది. రామున్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది నుంచి నవమి వరకు వసంతరాత్రులు జరిపి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రీరామనవమి పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లావాస్తులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ పార్వతీరాజరాజేశ్వర స్వామి, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, కరీంనగర్లోని ప్రముఖ ఆలయాలతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖనిలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయానికి దాదాపు 50వేల మందికిపైగా రానుండగా, వేడుకకు సర్వం సిద్ధం చేశారు.
రాజన్న ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని (తలువాలు) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు తరలిరానున్నారు. ఉదయం 11.55 గంటల నుంచి శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించనున్నారు. తలంబ్రాల ముహూర్తానికే శివపార్వతులు ‘ధారణ’ స్వీకరించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కల్యాణ వేదికను పూలతో అలంకరించారు. ప్రాంగణంలో తివాచీలు పరిచారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక టీవీలు ఏర్పాటు చేశారు.
కల్యాణ వేడుకను కనులారా తిలకించేందుకు బుధవారం సాయంత్రం నుంచే భక్తులు రాజన్న సన్నిధికి వస్తున్నారు. రాత్రి వరకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివపార్వతులు కూడా చేరుకున్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భక్తుల సందడి కనిపిస్తున్నది. బస్టాండ్ ప్రాంతం నుంచి గుడి ముందు వరకు ప్రధాన రోడ్డు కిక్కిరిసిపోయింది. ఏ వీధిలోకి వెళ్లినా శివపార్వతులతో కళకళలాడుతున్నది. సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. 15 లక్షలతో శ్రీరామనవమికి వచ్చే భక్తులకు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రామయ్య కల్యాణం తర్వాత రాజన్న ఆలయంలో ముఖ్యమైన కార్యక్రమం లింగధారణ. మానసికంగా శివుడిని పెళ్లాడడమే ‘ధారణ’ అంతరార్థం. ఇది జోగినీ వ్యవస్థకాదు. ఓ భరోసా కోసం వ్యాధిగ్రస్తులు, అభాగ్యులు పాటించే ఆచారం. తలంబ్రాల ముహూర్తానికి ‘లింగధారణ’ చేసుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచి వేలాది మంది శివపార్వతులు తరలివస్తారు. కల్యాణం సందర్భంగా వధూవరుల్లా పసుపు వస్త్రాలు ధరించి, తలపై జీలకర్ర , బెల్లం పెట్టుకొని, బాసింగం కట్టిన శూలాలు చేతబట్టుకొని, ఆలయ అర్చకుల వేదమంత్రాల మధ్య భగవంతుడిని స్మరిస్తూ ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకుంటూ రుద్రాక్షలను మెడలో వేసుకొని శివతత్వంలో మునిగిపోతుంటారు. అనంతరం కోడెమొక్కు చెల్లించి, అన్నపూజ కట్టుకుని తిరిగి వెళ్తారు.
ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో శ్రీసీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణ వేదికను పూలతో అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో తివాచీలను పరిచారు. చాందినీ వస్ర్తాలతో ఇల్లందకుంట ఆలయం శోభాయమానంగా కనిపిస్తుంది. స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేవాలయం విద్యుద్దీపాలతో అలంకరించారు.