విద్యాశాఖలో అవినీతి డొంక కదులుతున్నది. టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతంపై విచారణ తుది దశకు చేరినట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తన చాంబర్లో జిల్లా ఇన్చార్జి డీఈవో సమక్షంలో విచారణ జరపగా, అనేక లుకలుకలు బయటపడినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేసి విచారణ చేయగా.. ఈ పాపం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయం అందరిలో నెలకొన్నది. కాగా, పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో కర్త, కర్మ క్రియ అంతా ఒకే అధికారి అంటూ… మిగిలిన ఉద్యోగులందరూ విచారణ అధికారికి చెప్పినట్టు తెలుస్తున్నది. కలెక్టర్‌కు తుది నివేదికను సమర్పించే దిశగా అదనపు కలెక్టర్ చర్యలు తీసుకున్నట్టు సమాచారం కాగా, అంతటా దీనిపైనే చర్చ జోరుగా నడుస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిబంధనలకు విరుద్ధంగా 2022-23కు సంబంధించిన టెన్త్ ఆన్సర్ పేపర్స్‌ను విద్యాశాఖ పరీక్షల విభాగంలో పనిచేసే కొంత మంది అధికారులు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. టెన్త్ ఆన్సర్ పేపర్ల అమ్మకాల విషయంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కడం, అలాగే టెండర్లు లేకుండా విక్రయించడం, అందులోనూ ఒకే సంస్థకు కట్టబెట్టడం, అందుకు సంబంధించిన ఫైలును మాయం చేయడం, వచ్చిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఖాతాలో జమచేయకుండా మింగేయడం, రాష్ట్ర పరీక్షల విభాగం పలుసార్లు నోటీసులు జారీ చేసినా లెక్కచేయకుండా గుట్టుగా వ్యవహారం నడుపడం, ఈ విషయంలో ఏకంగా కలెక్టర్‌నే పక్కదారి పట్టించేలా రిపోర్టు తయారు చేయడం, నిధుల స్వాహాను కప్పి పుచ్చడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు ఖర్చు పెట్టామని చెప్పే ప్రయత్నాలు చేయడం, అందుకు కూడా ఎటువంటి అనుమతులు తీసుకోక పోవడం వంటి అంశాలను ఎత్తిచూపిన విషయం విదితమే. ‘టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్నరు?’ శీర్షికన గత నెల 15న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించగా, అప్పుడు ముందుగా రాష్ట్ర డైరెక్టర్ స్పందించారు. ఆ మేరకు 23న హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలంటూ జిల్లా విద్యాధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ కూడా అక్రమార్కులు మసిబూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారు. వీటిని నిశితంగా పరిశీలించిన రాష్ట్ర డైరెక్టర్ సీరియస్ అయిన విషయంపై ‘నమస్తే తెలంగాణ’ మరో కథనం ప్రచురించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది.

నిబంధనలకు విరుద్ధంగా పేపర్లను అమ్ముకున్న తీరుపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనాలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డైరెక్టర్.. పూర్తి వివరాలు ఆరా తీశారు. విద్యాశాఖలో జరిగిన అవినీతి తతంగంతోపాటు దానిని కప్పిపుచ్చడానికి చేసిన తెరచాటు ప్రయత్నాలు, తప్పుడు నివేదికలను గమనించిన కలెక్టర్ పమేలాసత్పతి విచారణకు ఆదేశించారు. అందుకోసం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ అశ్విని తానాజీ వాకడేను విచారణ అధికారిగా నియమించారు. ఆ మేరకు విచారణకు హాజరు కావాలంటూ పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన అదనపు కలెక్టర్.. శుక్రవారం ఉదయం తన చాంబర్లో విచారణ జరిపారు. జిల్లా ఇన్చార్జి డీఈవో మొండయ్య సమక్షంలో ఒక్కో అధికారిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వివరాలను నోట్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ బాగోతానికి కర్త, కర్మ, క్రియ అంతా ఒకే అధికారని, సదరు అధికారి వ్యవహారశైలి గురించి గతంలో డీఈవోగా పనిచేసిన జనార్దన్‌రావుకు పలుసార్లు చెప్పినా వినకుండా ఆ అధికారికే మద్దతు ఇచ్చారని పలువురు ఉద్యోగులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో తమకేమీ తెలియదని, అంతా సదరు అధికారి మాత్రమే నడిపించారని, జనర్దాన్రావు కూడా అతనికే మద్దతు ఇవ్వడం వల్ల తాము ఏమిచేయలేకపోయామని చెప్పినట్టు తెలుస్తున్నది. ఇదే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా లేకున్నా, ఆ బాధ్యతలను సైతం సదరు అధికారికి నిబంధనలకు విరుద్ధంగా అప్పటి డీఈవో కట్టబెట్టారని చెప్పినట్టు తెలిసింది. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు అదనపు బాధ్యతలను అడ్డుగా పెట్టుకొని చాలా అక్రమాలకు పాల్పడ్డారని, ట్రెజరీ అధికారులను మేనేజ్ చేసి, పలు బిల్లులు కూడా డ్రా చేశారని చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా టెన్త్ ఆన్సర్స్ పేపర్లు అమ్మకాలు జరిగిన దానిలో సదరు అధికారి తప్ప, తమ ప్రమేయం లేదని అదనపు కలెక్టర్‌కు వివరించినట్టు తెలుస్తున్నది.
విచారణ జరిపిన అదనపు కలెక్టర్, తన నివేదికను కలెక్టర్ పమేలా సత్పతికి పంపనున్నారు. అందుకోసం ఒకటి రెండు రోజుల సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ నివేదికపైనే చర్యలు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా చూసిన కొంత మంది అధికారులు, తిరిగి చక్రం తిప్పుతారా.. లేదా..? అన్నది మున్ముందు తేలుతుందన్న చర్చ కూడా ప్రస్తుతం విద్యాశాఖలో నడుస్తున్నది. కాగా అదనపు కలెక్టర్ మాత్రం, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చిన జరిగిన అక్రమాలపై నిక్కచ్చిగా నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు కలెక్టర్ కూడా చర్యలు తీసుకుంటారన్న చర్చ నడుస్తున్నది. అక్రమార్కులపై చర్యలుంటాయా.. లేవా..? అన్న దానిపై వచ్చే వారం వరకు వేచి చూడాలన్న చర్చ కూడా ప్రస్తుతం విద్యాశాఖలో జరుగుతున్నది. ఓ అధికారి చేసిన తప్పుడు వ్యవహారంలో ఎంత మందిపై ఎటువంటి వేటు పడుతుందోనన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నది.