కలెక్టరేట్, జూలై 15: వివిధ సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 307 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేస్తారని, వీటిని ఆయా విభాగాల అధికారులకు వెంటనే పంపి పరిష్కార మార్గాలు చూపాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.
అధికారులు వీటిని పరిశీలించి అర్జీదారులకు అండగా నిలువాలని సూచించారు. ప్రజావాణిలో నగర పాలక సంస్థ కార్యాలయానికి సంబంధించి 44, ఆర్డీవో ఆఫీసుకు 15, డీపీవోలో పెండింగ్ సమస్యలపై 14, డీఎంహెచ్‌వో కార్యాలయానికి 11 ఇతర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మిగతా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా, పలుమార్లు తాము ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమంటూ పలువురు ఫిర్యాదుదారులు అదనపు కలెక్టర్‌కు విన్నవించారు.
నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న పలు అవినీతి, అక్రమాలు, స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగుల నిర్వాకంపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆధ్వర్యంలో పలువురు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు.
సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ మాజీ సర్పంచ్ నిర్వాకంతో విలువైన తన భూమి కోల్పోవడంతో పాటు, గ్రామ ప్రజల దృష్టిలో చులకనయ్యామని, గ్రామానికి చెందిన కొల్ల వెంకటరెడ్డి అదనపు కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన హయాంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి దారి కోసం తనకు చెందిన మూడు గుంటల భూమి రూ.4లక్షల పైచిలుకు మొత్తానికి కొనుగోలు చేసి, అనంతరం డబ్బులివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిని పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్.. డీపీవో రవీందర్‌కు అప్పగించారు. కార్యక్రమంలో డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవోలు కుందారపు మహేశ్వర్, రమేశ్‌బాబు, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.