T Jeevan Reddy | రాయికల్, సెప్టెంబర్ 26 : చెరువులు, కుంటల ఆక్రమణపై వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్ మండలం ఇటిక్యాల్ గ్రామంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు కలెక్టర్ రెవెన్యూ చెరువులు, కుంటలు అన్ని శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణకు గురవుతున్నాయనీ, వీటిని నిర్వహింప చేయడానికి చెరువులు కుంటలు అన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ పరిధిని పరిగణలోకి తీసుకొని బఫర్ జోన్ తో హద్దులను సెప్టెంబర్‌లోగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటి వరకూ నిర్వహించలేదని మండిపడ్డారు. ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయంతోని చేయాల్సిన కార్యక్రమని అన్నారు.
జగిత్యాల మండలానికి సంబంధించి తిమ్మాపూర్ చెరువు, మోతే చెరువు, కండ్లపల్లి చెరువులన్నీ కూడా ఆక్రమణ గురవుతున్నాయనీ కలెక్టర్ ప్రజావాణిలో వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. భూ ఆక్రమణదారులు ఒకవైపు గుట్టలు తవ్వడం ఆ మట్టిని తీసుకువచ్చి చెరువులలో పోయడం చెరువులలో నీటి సాంద్రత తగ్గి మత్స్య కార్మికులకు నీటి నిలువ సామర్థ్యం తగ్గి చేపల పెంపకానికి అవురోధం ఏర్పడుతుందన్నారు. అలాగే రైతులకు భూగర్భ జలం తగ్గిపోయి సాగునీరు సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ సారి ఎల్నీనో ప్రభావంతోని చెరువులు,కుంటలలో నీటి చేరికనే ఇబ్బందికరంగా ఉందన్నారు. ఎఫ్టిఎల్ లెవెల్ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
ప్రభుత్వం మత్స్య కార్మికులకు ప్రకృతికి ద్రోహద పడే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేప పిల్లలను పంపిణీ చేసిందని, గత సంవత్సరం చూస్తే 25శాతం కూడా చెరువులలో చేపనారు పోయలేదన్నారు. ఈ సంవత్సరం ఇంతవరకు టెండర్ ప్రక్రియ కొలిక్కి రాలేదన్నారు. చేప పిల్లలను సెప్టెంబర్, అక్టోబర్‌లో పోస్తే అవి ఎదిగే అవకాశం ఉండేదని అన్నారు. కావున ప్రభుత్వం చేపపిల్లలు పోసేందుకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాయకులు మల్లేష్ యాదవ్, రాజిరెడ్డి, మహేశ్వరరావు, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.