కోల్సిటీ, మార్చి 11: ప్రముఖ సంఘ సంస్కర్త మదర్ థెరిసా స్ఫూర్తిగా ఆమె సేవా బాట పట్టారు. ఎవరైనా ఆపదలో, కష్టాల్లో, ప్రత్యేకించి ఆకలితో ఉన్నారంటే ఆమె నిద్రపోరు. స్వయంగా వంట చేసి అక్కడికి వెళ్లి.. ఆ అభాగ్యుల ఆకలి తీర్చడంలో ఆమెకు ఆమే సాటి.. ఆమె పెద్దపల్లి జిల్లా ఎయింటిక్లైన్ కాలనీ వాసి, అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్లి కవిత అనంత రాములు. అభాగ్యులకు అందించిన సేవలకు ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. కరోనా విపత్తు సమయంలో నిరాశ్రయులకు సాయంతోపాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద యువతుల వివావాహాలకు చేయూత, తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సేవలకు గుర్తింపుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ మేరకు హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురిని జాతీయ స్థాయి అవార్డులతో సత్కరించారు. అందులో భాగంగా అభయ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్లి కవితకు రాణీ రుద్రమదేవి జాతీయ అవార్డు ప్రదానం చేస్తూ ఘనంగా సత్కరించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సోషల్ జస్టిస్ సంస్థ చైర్ పర్సన్, వ్యవస్థాపకులు గాజుల శ్రీనివాస రావు ఈ అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా న్యాయమూర్తితోపాటు పలువురు ప్రముఖులు ఆవార్డు గ్రహీత కవిత సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తన సేవలను గుర్తించి జాతీయ అవార్డుతో సత్కరించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు గాజుల శ్రీనివాస రావు, కూచన వేణు, పరంజ్యోతిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కవితకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు రావడం పట్ల పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.