ఉమ్మడి జిల్లా నుంచి ఏటా వెయ్యి మందికి పైగా విదేశాలకు పయనం
మెడిసిన్, ఎంఎస్ వైపు అనేక మంది విద్యార్థుల చూపు
విపత్కర పరిస్థితులతో తల్లిదండ్రుల్లో టెన్షన్
ఉక్రెయిన్‌లో యుద్ధంపై క్షణక్షణం ఉత్కంఠ
పిల్లల యోగక్షేమాలు తెలుసుకునేందుకు కుటుంబీకుల ఆరాటం
కరీంనగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల బాట పడుతున్నారు. మంచి విశ్వవిద్యాలయాల్లో పట్టా పుచ్చుకోవాలన్న తపన కొందరిదైతే.. తక్కువ డబ్బులతో మెడిసిన్ పూర్తి చేయాలని మరికొందరు వెళ్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సంబంధిత దేశాల్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా ఇక్కడ తల్లిదండ్రులు ఉలిక్కి పడుతున్నారు. క్షేమ సమాచారం కోసం తపన పడుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నిత్యం ఉత్కంఠకు లోనయ్యారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న పిల్లలకోసం క్షణక్షణం భయంతో వణికి పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. అక్కడ జరుగుతున్న భీకర యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఉన్నత చదువుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏటా వెయ్యికిపైగా విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. అందులో ఎంఎస్, మెడిసిన్ కోర్సులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అందులోనూ ఎంఎస్ చేయడానికి ఎక్కువ శాతం యునైటెడ్ స్టేట్స్కు వెళ్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డీసీ, కాలిఫోర్నియా, మిచిగాన్, తదితర రాష్ర్టాల్లో జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అమెరికాలో సుమారు 4500 వరకు ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిని ర్యాంకుల ఆధారంగా టైర్-1, 2, 3లుగా వర్గీకరిస్తారు. వాస్తవానికి టైర్-1, 2 లు 500కు మించి ఉండవు. అక్కడి ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు ఆయా విద్యాసంస్థలకు ర్యాంకులు, అక్రిడిటేషన్లు ఇస్తుంటాయి. అందులోనూ కొన్ని స్కాలర్షిప్లు మంజూరు చేస్తే.. మరికొన్ని చేయవు. టాప్ విశ్వవిద్యాలయాల్లో పట్టా తీసుకుంటే.. మంచి ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఇటువైపు ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1996-97 నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగి.. 2000 సంవత్సరం నుంచి అది బాగా ఎక్కువైంది. ఇదంతా బాగానే ఉన్నా యూఎస్ఏకు పిల్లలను పంపించిన తల్లిదండ్రులు కూడా నిత్యం టెన్షన్ ఎదుర్కొంటున్నారు. అక్కడ నల్లజాతీయులు అప్పుడప్పుడు చేసే కాల్పుల్లో జరిగే పరిణామాలతో ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది కరోనా మహమ్మారి అమెరికాను సైతం ఉక్కిరిబిక్కరి చేసిన సమయంలోనూ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు క్షణక్షణం ఉత్కంఠకు లోనయ్యారు.
ఉత్కంఠ రేపుతున్న ఉక్రెయిన్ యుద్ధం
ఐటీ రంగం వారు అత్యధికంగా అమెరికా వైపు వెళ్తుండగా.. మెడిసిన్ చేయాలని భావించే చాలా మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాల బాట పడుతున్నారు. మన ప్రాంతంతో పోలిస్తే.. అక్కడ మెడిసిన్ చేయడానికి ఎక్కువ అవకాశాలుండడం, తక్కువ ఫీజుతో పూర్తిచేసే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు సదరు దేశాలకు వెళ్తున్నారు. రెండు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నది. దీనికి కారణం చూస్తే.. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థుల సంఖ్య దాదాపు యాభై నుంచి వంద మంది వరకు ఉన్నట్లు కనిపిస్తున్నది. నిజానికి ఉక్రెయిన్‌లో ఇంత మంది మెడిసిన్ చేస్తున్నారన్న విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఎవరికీ పెద్దగా తెలియదు. యుద్ధం ప్రారంభం కాగానే ఆయా కుటుంబాల తల్లిదండ్రులు.. తమ పిల్లలను కాపాడాలని, వారిని తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకొని రావాలంటూ వస్తున్న విజ్ఞప్తులతో ఈ విషయం బయటకు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి రావడానికి ఆస్కారం లేక కొందరు పక్కనే ఉన్న పోలాండ్ లాంటి దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఆ దేశాలు భారతీయులు తలదాచుకునేందుకు అంగీకరిస్తున్నట్లుగా.. కొంత మంది విద్యార్థుల ద్వారా తెలుస్తున్నది. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులనే కాదు, ఇతర పనులపై వెళ్లిన వారిని కాపాడేందుకు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పలు రకాల చర్యలు చేపట్టింది. అంతేకాదు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తున్నది. అయితే ప్రస్తుతం జరుగుతున్న భీకర యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం ఇక్కడి తల్లిదండ్రులు, వారి కుటుంబాల్లో నెలకొన్నది. క్షణ క్షణం బాంబుల వర్షం కురుస్తుండగా.. విద్య కోసం వెళ్లిన కొడుకులు, కూతుళ్లు క్షేమంగా ఉన్నారో..? లేదో.. తెలుసుకునేందుకు ఆరాట పడుతూ టెన్షన్‌కు లోనవుతున్నారు. మరికొంత మంది తమ పిల్లల పరిస్థితులను వీడియో కాల్స్ ద్వారా చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.
బాంబుల మోత భయపెడుతున్నది.
మేమున్న కీవ్ నగరంలో ఉదయం బాంబుల మోత వినపడింది. నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి. నేను డినిప్రో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో కలిసి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటున్నా. రాజధానిలో కొంతభాగం ఇప్పటికే రష్యా ఆక్రమించుకున్నది. ఇక్కడ పరిస్థితులు భయాందోళనకరంగా ఉన్నాయి. యుద్ధం ప్రారంభం కాకపోతే మరో వారం రోజుల్లో భారత్‌కు వచ్చేవాన్ని. మార్చి 1న విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నా. యుద్ధం మొదలు కావడంతో విమానాలు రద్దయ్యాయి. నాతోపాటు మరో 15 మంది మా యూనివర్సిటీలో చదువుతున్నారు. ముగ్గురు పది రోజుల క్రితం వెళ్లిపోయారు. ఇప్పటి వరకైతే మేం సురక్షితంగానే ఉన్నాం. మనదేశ ఎంబసీ అధికారులు వస్తమని చెబుతున్నారే తప్ప ఇంతవరకు రాలేదు.
– ఉక్రెయిన్ నుంచి కర్ర నిఖిల్‌రెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి (హుజూరాబాద్)