peddapally | పెద్దపల్లి, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : దేశంలో మారిన పరిస్థితులపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు వామపక్ష నేతలు, మాజీ విప్లవ మిత్రులను కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో 80, 90వ దశకం నాటి రోజుల్లో మావోయిస్టు పార్టీలో తనతో కలిసి పని చేసిన మిత్రులను శనివారం కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ మార్గాన్ని కోరుకుంటున్నారో.. ఎలాంటి ఉద్యమాలను చేపట్టాలో వారితోనే విస్తృతమైన అవగాహన ఉన్న శక్తులను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన యువతకు ఉద్యోగ అవకాశాల సమస్య, ఇతర మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సంఘటితమై తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య, చట్టబద్ధమైన మార్గాల్లో పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా యువత, నిరుద్యోగుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఎక్కడ చూసినా అసంతృప్తి, ఆగ్రహం దాగి ఉందన్నారు. పెల్లుబికిన ఆందోళన ఢిల్లీ నుంచే కాదు, జారండ్లో వ్యక్త పరుస్తున్న విద్యార్థుల భవిష్యత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఇతర ఆకృత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకు భద్రత కల్పించడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు చట్టబద్ధమైన పోరాటాలు నిర్వహించాలన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, వారి భూములు, అటవీ హక్కులు, జీవనోపాధిపై ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను, అటవీ హక్కులను పరిరక్షించేందుకు చట్టపరమైన మార్గాల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ న్యాయపరమైన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ప్రజల హక్కులను కాపాడేందుకు శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని మల్లా రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజిరెడ్డిని కలిసిన వారిలో మాజీ నక్సల్స్ బోడకుంటి సత్తన్న, ఆవుల రాజమౌళి, కొత్తూరు లింగన్న,ఎరుకల రాజన్న, బాబు, పానుగంటి సత్తన్న, బాలన్న, కంది చొక్కారెడ్డి. అడప లక్ష్మణ్, తిరుపతి రమాపద్మ, వసంతక్క, మూడుమడుల మల్లన్న, సీనియర్ జర్నలిస్టు కట్టా నరేందర్, ప్రజాఫ్రంట్ నాయకులు గాండ్ల మల్లేశం, గుమ్మడి కొమరయ్య తదితరులు ఉన్నారు.