కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో ‘సదరం’ అక్రమాల నిగ్గు తేలింది. వారం రోజుల పాటు విచారణ జరిపిన అధికారులు, బాధ్యులుగా తేలిన ఇద్దరు ఏజిల్ సిబ్బందిపై వేటు వేయడం కలకలం రేపింది. దివ్యాంగ సర్టిఫికెట్ల కోసం వచ్చే అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ, ఏమార్చుతున్న తీరును ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 11న వెలుగులోకి తెచ్చింది. శిబిరంలో జరుగుతున్న అక్రమాలను, బ్రోకర్లుగా మారిన సిబ్బంది తీరును బయటపెట్టింది. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ గుండా వీరారెడ్డి నలుగురు అధికారులతో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, దవాఖానలో అజమాయిషీ చెలాయిస్తున్న పీఆర్వోలను పూర్తిగా తొలగించడం సంచలనంగా మారింది.
కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 19 : కరీంనగర్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో నిర్వహిస్తున్న సదరం శిబిరాల వేదికగా అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దివ్యాంగ సర్టిఫికెట్ల పేరిట వసూళ్ల పర్వం సాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయిలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి దివ్యాంగులను వేధిస్తున్నారు. డిజెబులిటీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగుల ఫోన్ నంబర్లు తీసుకొని, నేరుగా వారికి ఫోన్లు చేసి, సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ఆశపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలానే ఈ నెల 10న గంగాధర మండలం గట్టుభూత్కూర్కు చెందిన దివ్యాంగుడు కొత్తూరి రాజయ్యకు వైకల్య సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఆయన కూతురికి ఇదే దవాఖానలోని ఎంసీహెచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సాదిక్ ఫోన్ చేసి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.
ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డికి దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఆయన స్పందించి నేరుగా సదరం క్యాంపు వద్దకు వచ్చి సాధిక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ బాగోతం మొత్తాన్ని ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలు చేసింది. ‘సదరం సర్టిఫికెట్‌కు రూ.30 వేలు’ శీర్షికన ఈ నెల 11న ప్రముఖంగా ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దీంతో వైద్య యంత్రాంగం కదిలింది. ఆర్ఎంవో నవీన, ఏవో శ్రీమాన్నారాయణ, అనస్తీషియాలజిస్ట్ శంతన్‌కుమార్, ఫిజీషియన్ సృజన్ సభ్యులుగా సూపరింటెండెంట్ వీరారెడ్డి ఒక కమిటీని వేసి విచారణ చేపట్టారు. సెక్యూరిటీ గార్డ్ సాధిక్‌ను ప్రధానంగా విచారించిన కమిటీ సభ్యులు, ఆయన చెప్పిన అనేక విషయాలతో నిర్ఘాంత పోయారు. దవాఖానలో పనిచేస్తున్న పీఆర్వో వినయ్ తనకు ఫోన్ నంబర్ల జాబితా ఇచ్చి, దివ్యాంగులకు ఫోన్ చేయించినట్టు సాధిక్ తెలిపాడు. ఈ విషయాన్ని పీఆర్వో కూడా అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, దవాఖానలో పనిచేస్తున్న పీఆర్వోలపైనే ప్రధానంగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవస్థనే రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.