Telugu tradition | ఓదెల, జులై 6 : ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇందులో పండుగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తినే లు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి వచ్చే ఏకాదశి పండుగను ప్రజలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది. దీంతో ప్రజలు ఈ తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.
ఇందుకు ఇండ్ల ముందు గోడలకు జాజు కలర్ రాసి దాని మీద తెల్లటి రంగులో తీనెలు తీయడం ద్వారా పండుగలకు సంకేతం. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయం చాలావరకు కనుమరుగవుతున్నది. వెనకటి రోజుల్లో గుడిసెలు, పెంకుటిల్లు ఇంటి దర్వాజాకు ముందు గోడలపై జాజు రాసి తెల్లటి రంగుతో తేనెలు తీసి పండగ వాతావరణం నెలకొల్పేవారు. అలాంటి పరిస్థితులు గ్రామాల్లో సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి. ఈ తరం పిల్లలకు తినెలు తీసే సాంప్రదాయం తెలవకుండా పోతుంది. అయితే ఆదివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ఓ మహిళ తన పెంకుటిల్లు దర్వాజా ముందు ఇలా తినెలు తీయడం కనిపించింది.