Huzurabad | హుజురాబాద్, నవంబర్ 24 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలో ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించనందున కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్ట ప్రకారం సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్స్ చట్ట ప్రకారం అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే తమ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపాధ్యక్షులు ఓడ్నాల ప్రభాకర్, ఎర్ర బొజ్జ నారాయణ, చల్లూరి రఘుచారి, రావుల సురేందర్, నడిగోటి రమేష్, వన్నాల శివాజీ, సహాయ కార్యదర్శి ఇప్పకాయల సాగర్, గోస్కుల మధూకర్, మామునూరి ప్రవీణ్, లీగల్ అడ్వైజర్ కామణి సమ్మయ్య, ప్రచార కార్యదర్శి భారత రజనీకాంత్, గరవేణి శ్రీకాంత్, జూపాక ఓదెలు, ప్రజా సంఘాల నాయకులు మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ సంఘాల నేతలు మాడుగుల ఓదెలు, ఎర్ర శ్రీధర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.