ధర్మారం, జూన్10: కరెంట్ షాక్కు మూగజీవాలు బలయ్యాయి. ఒర్రెలో నీళ్లు తాగుతుండగా విద్యుత్ షాక్ రావడంతో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇది చూసిన గొర్రెల కాపారులు కన్నీరుమున్నీరయ్యారు. చనిపోయిన గొర్రెలకు పరిహారం అందించాలని వేడుకున్నారు. గొర్రెల కాపరుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దాడి ఓదెలు, దాడి ఐలయ్య, నిట్టు ముజ్జయ్య, కడారి కొమురయ్య, నిట్టు లచ్చయ్య, ఆవుల భూమయ్య, బైర రాయలింగు, నిట్టు రాజు, నిట్టు మల్లయ్య, కొమ్మ లచ్చయ్యకు చెందిన సుమారు 700 గొర్రెలు మంగళవారం కటికనపల్లి గ్రామ శివారులో మేతకు వెళ్లాయి.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సున్నం మాటు ఒర్రె మీదుగా ఏడుగురు గొర్ల కాపలాదారులు మందను దాటిస్తున్నారు. అయితే ఆ ఒర్రె వద్ద కొన్నేళ్ల నాటి పాత 11 కేవీ విద్యుత్ స్తంభానికి తీగ మొకలు అల్లుకొని ఉండడంతో ఆకస్మాత్తుగా స్తంభంపై ఉన్న ఇన్సులేటర్ (పింగాణి పరికరం) పగిలి ఇనుప చువ్వలకు తాకింది. దీంతో స్తంభంపై నుంచి భూమి వరకు ఉన్న ఇనుప చువ్వల ద్వారా విద్యుత్ సరఫరా అయింది. పచ్చటి చెట్ల పొదలు అంటుకొని మంటలు వ్యాపించి, సమీపంలోనే ఒర్రెలోని నీటికి కరెంట్ సరఫరా అయింది. ఆ సమయంలో వంద గొర్రెల వరకు ఒర్రెలో నీరు తాగుతుండగా షాక్ తగిలి, 40 మూగజీవాలు అకడికకడే మృతి చెందాయి. మరో 30 గొర్రెలు తీవ్ర అస్వస్థత చెందాయి. అప్పటికే అప్రమత్తం కావడంతో గొర్రెల పెంపకందారులకు ప్రమాదం తప్పింది. మందను ఒర్రెలోకి వెళ్లకుండా మళ్లించడంతో మిగతా వాటికి ప్రాణాపాయం తప్పింది.
లేదంటే పెద్ద సంఖ్యలో గొర్రెల ప్రాణాలు గాలిలో కలిసేవి. గొర్రెల మృతితో కాపరులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మూగజీవాలు మరణించాయని ఆగ్రహించారు. సుమారు 6లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు. సంఘటనా స్థలాన్ని ధర్మారం ఎన్పీడీసీఎల్ ఏడీఈ విజయ్ గోపాల్ సింగ్, ధర్మారం ఏఈ ఎండీ ఖాసిం పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎన్పీడీసీఎల్ తరఫున మూగజీవాలకు పరిహారం అందించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఆర్ఐ -1 వరలక్ష్మి, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల నాగరాజు, గొర్రెల కాపరుల సొసైటీ మండలాధ్యక్షుడు జంగ మహేందర్, దొంగతుర్తి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య కాపరులను పరామర్శించారు.