రామగుండంలో తేలియాడే పవర్ ప్లాంట్
100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం
40 బ్లాక్‌లు ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల కెపాసిటీ
ఉత్పత్తిలో 17.5 మెగావాట్లు
వచ్చే మార్చి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
జ్యోతినగర్, అక్టోబర్ 30;రామగుండం ఎన్టీపీసీ సౌర సొబగులు అద్దుకుంటున్నది.. దేశంలోనే తొలిసారిగా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఉపక్రమించింది. 2.5 మెగావాట్ల సామర్థ్యంతో మూడు దశల్లో 40 బ్లాకులను నిర్మించాలని నిర్ణయించింది..తొలి దశలోని పనులు పూర్తికాగా 17.5 మెగావాట్ల సొలార్ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన 82.5 మెగావాట్ల కెపాసిటీతో కూడిన ప్లాంట్ మార్చినాటికి అందుబాటులోకి రానున్నది.
తెలంగాణ రాష్ర్టానికి కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచిన రామగుండం ఎన్టీపీసీలో యాజమాన్యం ఆరేండ్ల కిందట సోలార్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. 2014 జనవరి 21న 10 మెగావాట్ల ప్లాంట్‌ను ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చింది. 2032 నాటికి 60 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకుసాగుతున్నది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా 2020లో 100 మెగావాట్ల సామర్థ్యంతో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మూడు దశల్లో 40 బ్లాకుల్లో ఒక్కోదానిని 2.5 మెగావాట్ల కెపాసిటీతో నిర్మించాలని నిశ్చయించింది. తొలి విడుత పనులు తుది దశకు చేరుకోవడంతో గురువారం 17.5 మెగావాట్లను ఉత్పత్తిలోకి తీసుకువచ్చింది. కమర్షియల్ డిక్లరేషన్‌గా ప్రకటించింది. మిగతా 82.5 మెగావాట్లు రెండు, మూడు దఫాల్లో 2022 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు ఉన్న 10 మెగావాట్ల సోలార్ ప్లాంటులోని విద్యుత్ తెలంగాణకు నిరాటంకంగా సౌర వెలుగులు అందించగా 100మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుగా గుర్తింపు రానున్నది.