ధర్మపురి,అక్టోబర్30: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిణి సూచించారు. సుప్రీం కోర్టు పిలుపు మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జిల్లా న్యాయాధికార సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జిల్లా స్థాయి న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె ‘మహిళ సంరక్షణ చట్టాలు-సెక్షన్లు, ఫోక్సో చట్టం, యువత-మత్తుపదార్థాలపై కార్యక్రమానికి హాజరైన మహిళలకు, విద్యార్థినులకు వివరించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లో ముఖ్యంగా మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆడపిల్లలపై వివక్షను వీడాలన్నారు. గర్భిణి అనుమతి లేకుండా భర్త, అత్తమామలు అబార్షన్ చేయిస్తే ఏడేండ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని తెలిపారు. అలాంటి దవాఖానలను కూడా సీజ్ చేస్తామన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్యకరంగా కామెంట్స్ చేసినా, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఫొటోలు పెట్టినా.. పెట్టిన వ్యక్తికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాల్లో జోగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్‌కు బానిస కావద్దన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబందించి న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేనివారు న్యాయసేవాసదన్‌లో సంప్రదిస్తే న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి అరుణ, ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి ప్రమీల జైన్, జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి నిహారిక, ప్రతీక్సిహాగ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తాండ్ర సురేందర్, కట్కం చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు బండ భాస్కర్‌రెడ్డి, టీ సత్యనారాయణ, నర్సయ్య, కార్తీక్ తదితరులున్నారు..
నర్సన్న సన్నిధిలో పూజలు..
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ఎమ్జీ ప్రియదర్శిణి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి దేవస్థానం పక్షాన సిబ్బంది, పండితులు మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సన్మానించారు. ఇక్కడ పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముత్యాల శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అర్చకులు నరసింహమూర్తి తదితరులున్నారు.