జగిత్యాల టౌన్, జనవరి 30: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు వరంలా మారింది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇం దులో హాస్టల్ వసతితో పాటు ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల అభ్యర్థులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఐదు మాసాలకో బ్యాచ్ చొప్పున ఏడాదికి రెండు బ్యాచ్‌లను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 100 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని, ప్రస్తుతం 68 మంది శిక్షణకు ఎంపికయ్యారని, మిగితా వారిని త్వరలో ఎంపిక చేస్తామని జిల్లా షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. ఈ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు వరమంటూ నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల ప్రకారమే ఎంపిక
స్టడీ సర్కిల్లో శిక్షణ ఇచ్చేందుకు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీలకు 70 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. 33 శాతం మహిళలకు అవకాశం ఉంటుంది. గ్రూప్-1 ఇతర పోటీ పరీక్షలకు ఐదు మాసాల పాటు హాస్టల్ వసతితో కూడిన శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు వచ్చి బోధన చేస్తారు. ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, కరెంట్ ఎఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టేట్ ఎకానమీ జనరల్ సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సోషల్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో శిక్షణ ఉంటుంది.
అర్హతలు
కనీసం డిగ్రీ పూర్తి చేసిన వారికి స్టడీ సర్కిల్లో ప్రవేశానికి అర్హులు. అభ్యర్థి తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.
అద్దె భవనంలో అన్ని వసతులు
స్టడీ సర్కిల్‌కు జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ దగ్గర ఓ ప్రైవేట్ భవనాన్ని అధికారులు అద్దెకు తీసుకున్నారు. అందులో అన్ని వసతులు కల్పించారు. అధునాతన గదులు, బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేశారు. మంత్రి కొప్పు ల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో జగిత్యాలలో స్టడీ సెంటర్ ఏర్పా టు చేయడంతో జిల్లాలోని 18 మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, హాస్టల్ కలిగి పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు పొందే ప్రయోజనం ఉంటుంది.
ఎంతో ఉపయోగం
నిరుద్యోగ యువతకు ఈ స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని రంగాల్లో జాబ్‌లు సంపాదించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను సూచిస్తాం. నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తాం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఎంపిక చేస్తాం.