Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 27 : పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో 1,83,233 ఓటర్ల పేర్లు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఈ లెక్కన పరిశీలిస్తే సుమారు 30వేల ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో అధిక శాతం సింగరేణి రిటైర్డు కార్మిక కుటుంబాలు, వివాహితుల ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఓట్లు గల్లంతు కావడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. కాగా, మ్యాపింగ్ కింద 5,500 మందికి, అనామలీస్ కింద అంటే పేర్లలో అక్షర దోషాలకు సంబంధించి 49,034 మందికి అంతా కలిపి దాదాపు 55 వేల మంది ఓటర్లకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఈ నోటీసులకు ఆధారంగా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే ఓటు భద్రంగా ఉంటుందని చెబుతున్నారు.
సెప్టెంబర్ 16, 2026 నాటికి 18 సం.లు నిండిన వారు ఫారం-6 ద్వారా నూతన ఓటరుగా జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫారం-7, ఇతర వివరాలలో తప్పులు ఉంటే ఫారం-8 పూర్తి చేసి బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం గురువారం నుంచి రామగుండం నగర పాలక సంస్థతోపాటు నియోజక వర్గంలోని పలు గ్రామాలలో విస్తృతంగా వార్డు, గ్రామ సభలను ప్రారంభించారు. ఈ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఓటు తప్పిపోయి నోటీసులు అందుకున్న వారు నిర్దేశిత గడువు రోజున విచారణ అధికారి ముందుకు హాజరు కావల్సి ఉంటోంది.
ఓటు హక్కు కాపాడుకోవడం అందరి బాధ్యత
కాగా, ప్రతీ పౌరుడికి ఓటు అనేది ఒక వజ్రాయుధం, అలాంటి ఓటు హక్కును కాపాడుకోవడం అందరి బాధ్యత అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా గురువారం కార్పొరేషన్లోని 60 డివిజన్లలో విస్తృతంగా వార్డు సభలు జరిగాయి. స్థానిక 47వ డివిజన్ చంద్రబాబు కాలనీలో జరిగిన వార్డు సభలో అదనపు కలెక్టర్, కమిషనర్ జే.అరుణశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. రామగుండం నియోజక వర్గంలో ఓటు తప్పిపోయిన వారంతా వెంటనే బీఎల్ఎలు, వార్డు అధికారులను సంప్రదించాలనీ, లేదంటే తనకు సమాచారం ఇవ్వాలనానరు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడుతూ సర్ నోటీసులను ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. నోటీసులు అందిన ప్రతీ ఒక్కరూ అందులో పేర్కొన్న తేదీ, సమయానికి విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ సాంబమూర్తి, రామగుండం తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.