రెండో రోజూ రైతుల ఖాతాల్లో పెట్టుబడి జమ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
పాల్గొన్న ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులు
దుర్శేడ్‌లో మంత్రి గంగుల..
కాల్వశ్రీరాంపూర్‌లో దాసరి, చొప్పదండిలో సుంకె రవిశంకర్
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కర్షకలోకం నవ్వుతున్నది. సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నది. రైతుబంధు ఈ సారి ఇవ్వరని దుష్ప్రచారం చేసిన ప్రతిపక్షాల చెంప చెల్లుమనేలా.. పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేయడంపై మురిసిపోతున్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నది. అంతటా ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ కీర్తించింది. కాగా, కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, కాల్వశ్రీరాంపూర్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, స్వరాష్ట్రంలో ఎవుసం పండుగలా మారిందని పేర్కొన్నారు.
రైతుబంధు సన్న, చిన్న కారురైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో చాలా మంది రైతులు తమ పెట్టుబడి అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే ఈ యాసంగిలో వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో వరి సాగు చేసిన రైతులకు రైతుబంధు ఇస్తారా లేదా..? అనే అనుమానాలు ఉండేవి. దీనిని ఆసరా చేసుకున్న ప్రతిపక్షాలు ఈ సారి రైతుబంధు ఇవ్వరని ప్రచారానికి దిగాయి. దీంతో రైతుల్లో కూడా అనుమానాలు రేకెత్తాయి. ఇటు ప్రతిపక్షాల ప్రచారాన్ని అటు రైతుల అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతుబంధు అందరు రైతులకు వర్తించే విధంగా విడుదల చేశారు. మంగళవారం నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సంబురాలు
రైతు బంధు జమవుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు సంబురాలు చేసుకున్నారు. దుర్షేడులో రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎటు చూసినా సీఎం కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమకు రైతుబంధును ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ మర్చిపోమని ఈ సందర్భంగా పలువురు రైతులు వ్యాఖ్యానించారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రైతులతో కలసి మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో, మానకొండూర్‌లో ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి ఆధర్యంలో, తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాలను పాలతో అభిషేకించారు. కొడిమ్యాలలో ఎంపీపీ మెన్నేని స్వర్ణలత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటాలకు నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. అంతటా ‘జై కేసీఆర్’ ‘జైజై కేసీఆర్’ ‘రైతుల పక్షపాతి కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.
కేంద్రం ముంచాలని చూస్తే మేం అండగా నిలుస్తున్నాం..
వడ్లు కొనబోమంటూ రైతన్నను కేంద్రం నిండా ముంచాలని చూస్తుంటే రాష్ట్ర సర్కారు మాత్రం అండగా నిలుస్తంది. యాసంగిలో వడ్లు కొనబోమని అంటోంది. రైతును అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మరోపక్క వరి వేసుకోవాలని ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడం సరికాదు. ఇంకా ఇప్పుడేమో రైతు బంధు రాదని దుష్ప్రచారం చేసిన్రు. ఇప్పుడు ఏమైంది..? పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకోవాలి. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట తప్పరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి పథకాన్ని వందశాతం అమలు చేస్తరు. కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడి తగ్గి ఇబ్బంది నెలకొన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేశాం. అయితే కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పడంతో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేవలం మిల్లర్లు, ఇతరులతో ఒప్పందాలు చేసుకున్న రైతులు మాత్రమే వరి వేసుకోవాలి.-రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
నాట్లకు సాలుతయి..
నాకు మడిపల్లిల ఎకరం 5 గంటల భూమి ఉంది. ఉన్నది ఎకరమే అయినా పంట సరిగ్గా పండక పెట్టుబడులకు ఇబ్బందులైతుండే. కేసీఆర్ సారు మాసోంటి పేద రైతులకు అండగా నిలబడిండు. సార్ వచ్చినంక రైతులకు పాసు పుస్తకాలు ఇచ్చిండు. పంట సాయం బ్యాంకు ఖాతాలో వేస్తున్నడు. యాసంగి పంటకు రూ.5,625 బ్యాంక్ ఖాతాలో పడ్డయి. యూరియా, నాట్లకు సరిపోతయి. రైతుబంధు ఇస్తున్న సార్ సల్లగా ఉండాలి.
కైకిలీ, కూలీలకు అక్కరత్తనయ్..
పెట్టుబడి సాయం పైసలు నాకు ఆసరైతున్నయి. కూలీల ఖర్చులు ఎళ్లుతున్నయ్. నాకు గోపరపల్లిల 1.32 ఎకరాల భూమి ఉంది. పసలుకు నాకు రూ.9వేలు ఖాతాల పడుతయి. ఆటిని కైకిలోళ్లకే ఇస్తున్న. కేసీఆర్ సీఎం కాక ముందు లాగోడికి మస్తు తక్లిబ్గా అయ్యేది. పైసలు లేక వడ్డీ వ్యాపారులు, షావుకారుల వద్దకు పోయి మిత్తికి తీసుకచ్చేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లేవు. ఎవలికి చెయ్యి చాపకుంట పని చేసుకుంటున్న. వరి గూడా ఈ సారి ఎయ్యద్దంటే సీడ్ కంపెనీ వాళ్లు అచ్చి మేం కొంటమని చెప్పిర్రు. అందుకే సీడ్ వరి పెట్టుకుంటున్న. కేసీఆర్ సార్ సీఎం కాకపోతే మా బాధలు గోరంగా ఉండు. అప్పట్ల కరంట్ ఉండకపోయేది, విత్తనాలు దొరకపోయేది, పిండి బత్తాలకు పొద్దంతా లైన్ల ఉండి అరిగోస పడి తెచ్చుకునేది. గలాంటి కట్టాలు గిప్పుడేం లేవు. కేసీఆర్ రైతుల కోసం అన్ని చేత్తుండు. రైతులందరం రుణపడి ఉంటం.-జంగ రాజిరెడ్డి, రైతు, గోపరపల్లి (ఓదెల)
ఎప్పటికీ కేసీఆర్ సారే ఉండాలే..
మాసోంటి రైతులకు రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ సారే ఎప్పటికీ సీఎంగా ఉండాలే. ఆయన ఇస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. రైతులకు అవసరమైన పెట్టువడి ఎల్లుతంది. నాకు నాలుగెకరాల భూమి ఉంది. పసలుకు ఇరవై వేలు వస్తున్నయ్. విత్తనాలు, ఎరువులు తెచ్చుకోను, దున్నుడుకు ట్రాక్టర్ కిరాయి, కూలీలకు పెట్టుబడి అవసరం ఉంటది. నాకచ్చే పైసలైతే ప్రతి పసలుకు ట్రాక్టర్ కిరాయి ఎల్లుతంది. నేనింత కూరగాయలు పెట్టుకుంట. పైసలు మిగిలితే పురుగు మందులు అవీవీ కొనుక్కుంటున్న. రైతులను ఇంత మంచిగ చూసుకునేటోళ్లు దేశంల ఎవలన్నా ఉన్నరా. వరి పెడితే రైతుబంధు ఇవ్వరని అట్టిగ ప్రచారం చేసిండ్రు. మాకైతే కేసీఆర్ మీద నమ్మకం ఉండె. అట్ల జరగదని మల్లోసారి సార్ నిరూపించిండు. ఆయనే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలే.- ఎర్ర రాజేందర్, గోపాల్పూర్ రైతు( కరీంనగర్ రూరల్)
రెండ్రోజుల్లో 188.15కోట్లు
రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని దశలవారీగా అకౌంట్లలో వేస్తున్నారు.
తొలి రోజు మంగళవారం ఉమ్మడి జిల్లాలో 2,23,244 మంది రైతులకు 62 కోట్ల 2 లక్షల 87 వేల 256 ఖాతాల్లో వేశారు. బుధవారం మరో 1,80,229 మంది రైతుల ఖాతాల్లో 126 కోట్ల 12 లక్షల 98 వేల 925 జమచేశారు. రెండు రోజుల్లో మొత్తం 4,03,473 మంది ఖాతాల్లో 188 కోట్ల 15 లక్షల 77 వేల 181 జమ చేశారు.
పెట్టుబడి కష్టాలు తీరినయి
మాది గంగాధర మండలం రంగరావుపల్లి. మాకు ఉప్పరమల్యాల రెవెన్యూ గ్రామ శివారులో ఎకురం ఎవుసం భూమి ఉన్నది. పదేండ్ల కింద పొలం ఏసేందుకు నీళ్ల సౌలత్ లేక భూమిని బీడు పెట్టి కైకిలి పోయినం. మూడేండ్ల సంది మస్తు నీళ్లు అత్తున్నయి. నీైళ్లెతే అత్తున్నయి గనీ పొలం ఎయ్యాలంటే పెట్టుబడి కావాలె. ఎట్ల అని మళ్ల రంది వడ్డం. తెలిసినోళ్ల దగ్గర అప్పు చేసి పొలం దున్నిచ్చెదాన్ని. దుకాన్ల ఉద్దెర పెట్టి ఇత్తనాలు, ఎరువులు తెచ్చికునేది. మళ్ల వడ్లు అమ్మినంక పైసలు ఇచ్చేది. కేసీఆర్ సారు రైతు బంధు కింద ఎవుసానికి పెట్టుబడి సాయం ఇత్తున్న సంది రంది లేకుంటైంది. పంటలు ఏసుటానికి ముందుగాల్ననే ఖాతాల పైసలు ఏత్తున్నరు. యేసంగిల పంటేసుటానికి నా బ్యాంక్ ఖాతాల సర్కారు 5 వేల ఏసింది. యేడాది పొడుగునా నీళ్లు ఇచ్చి, 24 గంటల కరంటు ఇచ్చి, పెట్టుబడి సాయం జేత్తున్న కేసీఆర్ సారు అసొంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు జూల్లే. సారును ఎప్పటికి మేం మర్చిపోం.-ద్యావ ప్రేమల, మహిళా రైతు, రంగరావుపల్ల(గంగాధర)