సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 29: బ్యాంకర్లు నిర్వహించే రుణ మేళాను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ (స్థానిక సంస్థలు) సూచించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన రుణ విస్తరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ను సందర్శించి మాట్లాడారు. దేశాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమైందని తెలిపారు. వ్యవసాయ, గృహ, వాహ న, పరిశ్రమల స్థాపనకు అవసరమైన రుణాలను బ్యాం కుల నుంచి అందిపుచ్చుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ పథకాల్లోని పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవనజ్యోతి యోజన, తదితర పథకాల ఆవశ్యకతను వివరిస్తూ, పథకాల ద్వారా కలిగే లబ్ధిని వినియోగించుకోవాలన్నారు. రుణ విస్తరణలో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాలకు 132.10కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆకట్టుకున్న బుర్ర కథ..
బ్యాంకులు అందిస్తున్న రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలుపడంతోపాటుగా ఫేక్ కాల్స్, మెస్సేజ్‌లకు స్పందించి బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులకు తెలియజేయడం ద్వారా జరిగే మోసాలను కళాకారులు బుర్ర కథ రూపంలో వివరించిన ప్రదర్శన ఆకట్టుకున్నది. అనంతరం ఆయా బ్యాంకుల ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను అదనపు కలెక్టర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక్కడ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డీజీఎం అరుణ్‌కుమార్, ఎస్బీఐ డీజీఎం రవీంద్రబాబురావు గురావ్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, లీడ్ డిస్ట్రిక్ బ్యాంకు మేనేజర్ రంగారెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ గంగాధర్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.