లొల్లి పెట్టుకోవాలని చూస్తుండ్రు
ఈటలకు ఓటమి తప్పదు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హుజూరాబాద్, అక్టోబర్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ఇష్ట ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తాము తలచుకుంటే ప్రధాని మోదీపై మాట్లాడలేమా? అన్నారు. తమకు సంస్కారం ఉందని, అలా మాట్లాడలేమని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈటల రాజేందర్ కరోనా సమయంలో, వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో ఏం మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. ఈటల ఎన్ని వస్తువులు పంచినా.. ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేస్తారని, కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. నిబంధనలను తుంగ లో తొక్కి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు గిల్లి కజ్జాలు పెట్టుకొని లొల్లి పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, హుజూరాబాద్‌లో సానుభూతి డ్రామాలు నడువనని తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.