సుమారు కిలో నకిలీ బంగారం పట్టివేత
3 బైకులు, 6 సెల్ఫోన్లు స్వాధీనం
ఐదుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీసీపీ రవీందర్
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 25 : నకిలీ బంగారం విక్రయిస్తున్న కర్ణాటకకు చెందిన అంతర్ రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నకిలీ బంగారాన్ని అసలుదిగా నమ్మిస్తూ విక్రయిస్తున్న ముఠా సభ్యులు వస్తున్నారనే పక్కా సమాచారం మేరకు బుధవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ రాజ్‌కుమార్, పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్ బసంత్‌నగర్ ఠాణా పరిధిలోని ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. ఐదుగురు అనుమానితులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద కిలో నకిలీ బంగారంతో పాటు మూడు బైక్‌లు, ఆరు సెల్ఫోన్లు లభించాయి. ఈ మేరకు ఏసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ రవీందర్ కేసు వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన నకిలీ బంగారం ముఠా సభ్యులు ఇక్కడికి వస్తున్నారనే సమాచారం మేరకు ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. ఐదుగురు అనుమానితులను తనిఖీ చేయగా కిలో నకిలీ బంగారం పట్టుబడింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ గ్రామానికి చెందిన ఎండీ మొయినుద్దీన్, మునీరుద్దీన్కు వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఇద్దరు పరిచయమయ్యారు. ఆయుర్వేద మందులు ఇస్తామని చెప్పి వారి సెల్ నంబర్లు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి తమ వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, దాన్ని కర్ణాటకలో అమ్మితే పోలీసులు పట్టుకుంటారని, అందుకే ఇక్కడి వచ్చినట్లు చెప్పారు. డబ్బులు అత్యవసర మవుతుండడంతో తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి మొయినుద్దీన్, మునీరుద్దీన్కు రెండు బంగారు గుండ్లు ఇచ్చి పరీక్షించుకోమని చెప్పారు. బంగారం ఒరిజనల్ అని తేలడంతో నమ్మి అడ్వాన్స్‌గా రూ. 5వేలు ఇచ్చారు.
తిరిగి బుధవారం ఉదయం ఫోన్ చేసిన ముఠా సభ్యులు కర్ణాటక నుంచి బంగారం తీసుకువచ్చామని, పెద్దపల్లి మండలం అప్పన్నపేట సమీపానికి రమ్మని మొయినుద్దీన్, మునీరుద్దీన్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తమ వద్ద రూ. 10 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పగా వారికి 20 పూసల గల దండ తీసి ఇచ్చారన్నారు. ఇంటికి తీసుకువెళ్లి పరీక్షించగా అది నకిలీ బంగారమని తెలిసి మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామన్నారు. తనిఖీ నిర్వహించి నకిలీ బంగారం విక్రయిస్తున్న కర్ణాటకకు చెందిన సచిన్, సతీశ్, దర్శన్, మౌనిష్, ఆనంద్‌ను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులు రాజ్‌కుమార్, షేక్ మస్తాన్, నర్సింహారావు, లచ్చన్న, మహేందర్, సంపత్‌కుమార్, సదానందం, చంద్రశేఖర్, ప్రకాశ్, మల్లేశ్, సుమన్, భాస్కర్, రాకేశ్, కిరణ్, సునీల్‌ను రామగుండం సీపీ, డీసీపీ అభినందించారు.