ఇక్కడ పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో..?
దొంగదీక్షలు మాని ప్రజాక్షేత్రంలో తేల్చుకో..?
ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజ్ సవాల్
సీఎం కేసీఆర్‌ను దూషిస్తే సహించబోమని హెచ్చరిక
హుజూరాబాద్, ఆగస్టు 25: ‘రేవంత్‌రెడ్డి.. నీకు దమ్ము, ధైర్యముంటే హుజూరాబాద్‌లో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో..? కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు పీసీసీకి అధ్యక్షుడు కాగానే రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినట్లు పోజులు కొడుతున్నడు’ అంటూ ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిప్పులు చెరిగారు. ప్రాణాలను బలిపెట్టి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌పై స్థాయి మరిచి విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన కేసీఆర్‌పై అత్యంత నీచంగా మాట్లాడడం రేవంత్ కుసంస్కారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ‘తెలంగాణలో జరిగే అభివృద్ధి గురించి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు.. కానీ ఈ మూర్ఖుడికి మాత్రం అర్థం కావడం లేదు’ అంటూ విమర్శించారు. రేవంత్‌రెడ్డి నీకు దమ్ముంటే గజ్వేల్‌లో కాలుదువ్వడం కాదు.. హుజూరాబాద్‌కు రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. రౌడీలతో దొంగ దీక్షలు చేయడం మాని ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు.
త్వరలో నీ చిట్టా విప్పుతా..
‘ములుగు ఎమ్మెల్యే సీతక్క నీ ఆదేశాల మేరకు చంద్రబాబు కాళ్లు మొక్కుతున్నది.. అసలు ఏ పార్టీ.. నిన్ను ఎవరూ నడిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు..’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎంతమంది వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకున్నవో తమకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో చిట్టా బయట పెడుతా అని ప్రకటించారు. ‘దళితుల భూములు దోచుకున్న ఈటల రాజేందర్ తన రక్షణ కోసం మోదీ పంచన చేరాడు. నీవేమో బ్రోకర్ లాగా నోటికచ్చినట్లుగా మాట్లాడుతున్నవ్.. నీవు వాడే భాషేంది?’ అని నిలదీశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు..రేవంత్‌రెడ్డి ఆత్మగౌరవ సభల పేరిట హంగామా చేస్తున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి..
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి భయపడే ఒక్కటై, కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హితవుపలికారు.
గులాబీ జెండాలు ఎగురవేయండి..
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇండ్లపై గులాబీ జెండాలు ఎగురవేసి అభిమానం చాటాలని గువ్వల బాలరాజు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.