అందుబాటులో ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు
ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఏర్పాట్లు
గంగాధర, నవంబర్ 21: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాలకు వస్తున్న ధాన్యానికి అనుగుణంగా ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు గన్నీ సంచులు, టార్పాలిన్ల కొరత లేకుండా చూస్తున్నారు. కేంద్రాల వద్ద రైతుల కోసం తాగునీరు, నీడ ఏర్పాటు చేయడంతో పాటు కరోనా నేపథ్యంలో ప్రథమ చికిత్స పెట్టె, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో చెరువులు నింపడంతో వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగలా మారింది.
33 కేంద్రాలు ఏర్పాటు
మండలంలో 33 గ్రామాలు ఉండగా గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గంగాధర మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 1, గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో 12, కురిక్యాల సింగిల్ విండో ఆధ్వర్యంలో 9, ఐకేపీ ఆధ్వర్యంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం నుంచి తాలును తీయడానికి 34 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశారు. తేమ శాతాన్ని పరీక్షించడానికి 33 తేమ యంత్రాలను తీసుకువచ్చారు. వరి ధాన్యాన్ని తూకం వేయడానికి 56 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాగే, ఆయా కొనుగోలు కేంద్రాల్లో కొరత లేకుండా 3 లక్షలా 20 వేల గన్నీ సంచులను రైతులకు అందుబాటులో ఉంచారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా రక్షణ కోసం 520 టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు.