జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సదస్సు
రామగిరి, ఆగస్టు 21 : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. పెద్దపల్లి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘డిస్ట్రిక్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్’ సదస్సు సెంటినరీకాలనీలోని జేఎన్టీయూలో శనివారం చేపట్టగా, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి మధూకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేయించారని వివరించారు. రహదారుల నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రోడ్ల నిర్మాణంలో భాగంగా సాంకేతికత వినియోగంపై ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిపుణులు తమ అభిప్రాయాలను వివరించారు. ప్లాస్టిక్‌తో తయారైన సామగ్రిని రహదారుల నిర్మాణంలో వినియోగించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నట్లు వారు వివరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక తదితరులు పాల్గొన్నారు.