భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
29, 34, 35 వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ
జగిత్యాల అర్బన్, ఆగస్టు 19: జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని 34,35 వార్డుల్లో రూ.11లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు బల్దియా చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం 29వ వార్డులో డీఎంఎఫ్టీ నిధులు రూ.9.20లక్షలతో ముదిరాజ్ సంఘ భవనానికి భూమిపూజ చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. పట్టణంలో డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టామని చెప్పారు. రూ. 36 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వుతున్న రోడ్ల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ధరూర్ క్యాంపులో 10 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకు మిషన్ భగీరథతో వినియోగంలోకి వచ్చిందని చెప్పారు. టీఆర్‌నగర్, నూకపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. గత పాలకులు అనుసరించిన అస్తవ్యస్థ విధానాలతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాల భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ స్వరూపారాణి, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, హనుమండ్ల జయశ్రీ, పంబాల రాంకుమార్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, డీఈ భద్రునాయక్, ఏఈ ఆయూబ్‌ఖాన్ ఉన్నారు.