పదవిలో ఉండి ఆస్తులు పెంచుకున్నావ్
దళితబంధుపై ఇష్టానుసారంగా మాట్లాడడం శోచనీయం
ప్రజలే తగిన గుణపాఠం చెప్తరు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
జమ్మికుంట, ఆగస్టు19 : ‘దళిత, బహుజనుల భూములు లాక్కున్న నీవు ఒక దళిత ద్రోహివి.. ఇది నీకు ధర్మమా’? అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘాటుగా ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి దళిత బంధు పథకంపై ఇష్టానుసారంగా మాట్లాడడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయ్యాలే వేదాలు వల్లించినట్లు ఆయన మాటలున్నాయని తెలిపారు. ఏడేళ్లుగా వివిధ కీలక పదవుల్లో ఉండి తన ఆస్తులు పెంచుకున్నాడని, ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘దళిత, బహుజనులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడమేనా..? నీ ధర్మమా’ అని ప్రశ్నించారు. దళిత దేవుడు సీఎం కేసీఆర్ అని, 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఏ పార్టీ, ఏ నాయకుడు దళితులను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి దళితుల ఆర్థికాభివృధ్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఏ నాయకుడికీ లేదని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొన్ని పార్టీల నాయకులు దళిత బంధు పథకంపై తలా, తోక లేకుండా మాట్లాడుతున్నారని, వారికి దళితులు ఇప్పుడు గుర్తుకొచ్చారా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నాడే బడ్జెట్లో పెట్టి ఆమోదం తెలిపారని, ఈటల ఈ విషయాన్ని మరిచిపోయి దళిత వ్యతిరేక పార్టీలో చేరాడని దుయ్యబట్టారు. దళిత బంధు తన వల్లనే వస్తుందని ఈటల అనడం హాస్యాస్పదమన్నారు. సోది మాటలు పక్కకు పెట్టి నియోజకవర్గానికి బీజేపీ ఏం చేస్తుందో.. చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల ఆరాటమంతా ఓట్ల మీదనేనని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ప్రజలు బీజేపీని నిలదీయాలను విజ్ఞప్తి చేశారు. ఓట్ల కోసమే సీఎం వచ్చాడని అంటున్న ఈటల, రైతు బంధు ఇక్కడే ప్రారంభించిన విషయంపై ఈ మాట్లాడుతావో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం పాల్గొన్నారు.