అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతాం
ప్రజలు ప్రగతిలో భాగస్వాములుకావాలి
బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు సహకరించాలి
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
అధికారులతో సమీక్షా సమావేశం
వేములవాడ, డిసెంబర్ 18: వేములవాడ రాజన్న ఆలయ, పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయం. అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతం. టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా 167ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడిచెరువును 91.68కోట్లతో సుందరీకరిస్తున్నం. ఇప్పటికే 55కోట్లు వెచ్చించినం. ఆలయ విస్తీర్ణం కోసం 30కోట్లతో దాదాపు 30ఎకరాలు సేకరించినం. 50వేల మంది భక్తులు వీక్షించే విధంగా స్వామివారి కల్యాణవేదిక, భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట, 2వేల మంది ఒకేసారి కూర్చుండేలా నిత్యాన్నదానసత్రం నిర్మిస్తం. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం స్థలాలు కోల్పోతున్న యజమానులకు గజానికి 30వేలు చెల్లిస్తాం. సహకరిస్తే కోట్లాది భక్తులకు మేలు చేసినవారవుతారు. పట్టణంలో 80కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం, తిప్పాపూర్ను జంక్షన్ చేస్తాం.
రాజన్న ఆలయ, వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఉద్ఘాటించారు. శనివారం వేములవాడ ఆలయ సమావేశమందిరంలో వీటీడీఏ వైస్‌చైర్మన్, సీఈవో ముద్దసాని పురుషోత్తంరెడ్డితో కలిసి ఆలయ, పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా 167ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడిచెరువును 91.68కోట్లతో సుందరీకరిస్తున్నామని, ఇప్పటికే 55కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. 30కోట్లతో దాదాపు 30ఎకరాలను రాజన్న ఆలయ విస్తీర్ణం కోసం భూసేకరించామని పేర్కొన్నారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు నిత్య పుష్కరాలను తలపించేందుకు గుడిచెరువులో పుష్కరఘాట్లు నిర్మిస్తున్నామన్నారు. 800 మీటర్ల పొడవుతో ఘాట్ల నిర్మాణం, వచ్చే శివరాత్రినాటికి పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటికే గుడిచెరువులో నిత్యం గోదావరి జలాలు ఉండేందుకు 14కోట్లతో ఎత్తిపోతలు పూర్తిచేశామని గుర్తు చేశారు.
80 అడుగులతో రోడ్డు విస్తరిస్తాం..
వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. రెండు భాగాలుగా విస్తరణ పనులు చేస్తామని, ఇందులో మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం దాకా, ఆలయం నుంచి పోలీస్‌స్టేషన్ దాకా 80 అడుగుల వెడల్పుతో విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గం ఇందుకు తీర్మానం కూడా చేసిందని తెలిపారు. వీటీడీఏ కూడా ఇందుకు అనుమతి ఇచ్చిందని, వచ్చే జనవరిలో పనులు ప్రారంభించి 2022లో పూర్తిచేస్తామని చెప్పారు. ప్రజలతో పాటు భక్తులకు ఉపయోగపడే రహదారి విస్తరణకు సహకరించాలని కోరారు. 125కోట్లతో ఇప్పటికే పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మించామని, మిగిలిన పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పారు. ఇంకా బతుకమ్మ తెప్ప వద్ద మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, ఇందుకు మూలవాగుపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. అలాగే చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టి నీరు నిల్వ ఉండేలా అంచనాలు రూపొందించామని, వీటీడీఏ ద్వారా అనుమతి పొందేందుకు నివేదికలు సిద్ధం చేశామని చెప్పారు. అలాగే 9కోట్లతో భూసేకరణ చేసి తిప్పాపూర్ను జంక్షన్ చేస్తామని చెప్పారు. రెండో బస్టాండ్ భక్తులకు అందుబాటులో ఉండేలా జగిత్యాల బస్టాండ్ సమీపంలో నిర్మిస్తామన్నారు. అలాగే మహాలక్ష్మీవీధి నుంచి నాంపల్లి దాకా మరో రోడ్డును కూడా ఏర్పాటుచేసి నాంపల్లి గుట్టకు అనుసంధానిస్తామని చెప్పారు.
30ఎకరాల్లో ఆలయ అభివృద్ధి..
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సేకరించిన 30ఎకరాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మాణాలు చేపడతామన్నారు. ఇందులో 50వేలమంది వీక్షించే విధంగా స్వామివారి కల్యాణవేదిక, భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ వేదిక, 2వేల మంది ఒకేసారి కూర్చుండేలా నిత్యాన్నదానసత్రం నిర్మిస్తామని వివరించారు.
గజం 30వేలు ఇస్తాం.. సహకరించండి
బద్దిపోచమ్మ ఆలయం ప్రస్తుతం 2 గుంటల్లో ఉన్నందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆలయాన్ని ఎకరం విస్తీర్ణంలో పునఃనిర్మించేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక రూపొందించామని, ఇందులో స్థలాలు కోల్పోతున్న యజమానులకు గజానికి 30వేలు చెల్లిస్తామని, దయచేసి సహకరించాలని ఎమ్మెల్యే నిర్వాసితులను కోరారు. అలాగే వారికి అతితక్కువ కిరాయికే దుకాణం కేటాయిస్తామని చెప్పారు. 20మంది నిర్వాసితులకు కూడా రాజన్న ఆలయంలో ఉద్యోగ ఉపాధిని కల్పిస్తామని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులకు మేలు చేసినవారవుతారని, కనుక ఆలోచించి సహకరించాలని మరోసారి కోరారు.
పట్టణంలో 80కోట్లతో పనులు
వేములవాడ పట్టణాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు దాదాపు 80కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. ఇప్పటికే 20కోట్ల నిధులు మంజూరు కాగా, టెండర్లు పూర్తికావస్తున్నాయన్నారు. మురుగు కాలువలను మళ్లించేందుకు 33కోట్లతో ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని చెప్పారు. 40కోట్లతో వీధి దీపాలను కూడా ఏర్పాటుచేసేందుకు నివేదికలు సిద్ధం చేశామని చెప్పారు. రాజన్న ఆలయంతో పాటు పట్టణాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, మిషన్‌భగీరథ ఈఈ విజయ్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, రోడ్లు భవనాలశాఖ ఈఈ కిషన్‌రావు, వీటీడీఏ సీఈ శ్యామ్‌సుందర్, రాజన్న ఆలయ ఈఈ రాజేశ్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, డీఈలు ప్రశాంత్‌కుమార్, శాంతయ్య, పట్టణ ప్రణాళికా అధికారి అంజయ్య, ఏఈ నర్సింహస్వామి ఉన్నారు.