కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దేశానికే ఆదర్శం
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం మండలంలో విస్తృత పర్యటన
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
114 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ధర్మారం, ఆగస్టు 18: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఉద్ఘాటించారు. ధర్మారం మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో 114 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్, జ్యూట్ వస్తువుల తయారీ కోసం ఎంపికైన మహిళల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం సాయంపేటలో వైకుంఠధామం, బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఖిలావనపర్తిలో నంది మేడారం సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నర్సింహులపల్లిలో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేసి, మున్నూరు కాపు సంఘ భవనం అసంపూర్తి పనులకు, యాదవ, గౌడ సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇటీవల అదే గ్రామంలో 6 గేదెలు కరెంట్ షాక్‌తో మరణించగా ఒక్కో మూగ జీవికి రూ. 40 వేల చొప్పున రూ. 2.40 లక్షల పరిహారం చెక్కులను బాధిత రైతులకు మంత్రి అందజేశారు. ఆయా చోట్ల మంత్రి ఈశ్వర్ ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ, జ్యూట్ ద్వారా వస్తువుల తయారీపై శిక్షణ ఇస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి ఉపాధిని కల్పించే బాధ్యత ఎస్సీ కార్పొరేషన్‌దేనని ఆయన హామీ ఇచ్చారు.
ఈ పథకం జగిత్యాల జిల్లాలో విజయవంతమైందని, దానిని స్ఫూర్తిగా తీసుకోవాలని మహిళలకు ఆయన సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గ్రామానికో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఇవ్వడంతో పాటు వైకుంఠ ధామాల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, హరిత హారం నర్సరీలు ఏర్పాటు చేయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచులు చెనెల్లి సాయి కుమార్, సాగంటి తార, అడువాల అరుణ జ్యోతి, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, మోతె సుజాత, దాడి సదయ్య, ఉప సర్పంచులు ఆవుల లత, బద్దం శ్యామల, కత్తెర్ల కోమలత, కీసర స్వరూప రాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, మండల సభ్యుడు పాక వెంకటేశం, విండో వైస్ చైర్మన్ సామంతుల రాయమల్లు, వార్డు సభ్యులు, సింగిల్ విండో, ఏఎంసీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.