శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం
తొలి విడుత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మందికిపైనే రాక
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వతంత్ర భారతావనిలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. దశాబ్దాలుగా అంధకారంలో మగ్గిన అణగారిన వర్గాల్లో వెలుగులు నింపే చారిత్రక ఘట్టానికి మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా బీజం పడింది. ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ కేంద్రంగా విప్లవాత్మక ‘దళితబంధు’ పురుడుపోసుకున్నది. దగాపడ్డ జీవితాలకు కొత్త వెలుగును తెచ్చింది. ‘రైతు బంధు’కు శ్రీకారం చుట్టిన శాలపల్లి-ఇందిరానగర్ నుంచే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి సోమవారం అంకురార్పణ చేసి 15 మందికి పత్రాలు అందజేయగా,ఈ సభకు దళిత దండు ఉప్పెనలా తరలివచ్చింది. అడుగడుగునా దండోరా మోగించింది. “దళితజాతికి దార్శనికుడు.. అభినవ అంబేద్కరుడు.. మా కేసీఆర్” అంటూ జేజేలు పలికింది. ‘జై భీమ్’ ‘జై దళితబంధు’ ‘జై హింద్’ అంటూ కేసీఆర్ నినదించగా, చప్పట్లతో హోరెత్తించింది. దళితబాంధవుడు తమ భవిష్యత్‌కు ఇచ్చిన భరోసాతో సంతోషంగా వెనుదిరిగింది.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా దళితబంధుకు శ్రీకారం చుట్టారు. వేదికపైనే 15మందికి రూ.10లక్షల సాయం మంజూరుకు సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేయగా, దళితులు మురిసిపోయారు. “దళిత బంధు పథకం ఆషామాషీది కాదు. ప్రతి కుటుంబానికీ పథకం అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తం. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడంతో సంబురపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 25 వేల కుటుంబాలకైనా రూ.10లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించడంతో జేజేలు పలికారు. సీఎం కేసీఆర్ వేదికపై మాట్లాడుతున్నంత సేపు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు చాటారు. ఇన్నేండ్ల తమ కష్టాలు.. కన్నీళ్లు.. ఆణచివేతలను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ ఇచ్చిన భరోసాతో గుండెల నిండా ధైర్యం.. సంతోషాన్ని నింపుకొని తిరుగుపయనమయ్యారు. దారి వెంట సంబురాలు జరుపుకున్నారు.
దళితబంధు ప్రారంభంతో దళితవాడల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆడబిడ్డలు అభిమానం చాటారు. తమ ఇండ్ల ముందు వాకిళ్లను రంగురంగుల రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ‘దళితబంధు’ ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ ఆకృతి వచ్చేలా ముగ్గులు వేశారు. ఇంటి ముందు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టారు. తమ కాలనీలను కూడా అలంకరించుకొని, దళిత బంధుకు స్వాగతం పలికారు. ఇంట్లో దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాజెల్లను సిద్ధం చేసి, సభకు సంబురంగా వెళ్లారు.
కదిలిన దండు..
తమ బతుకులు మార్చి వెలుగులు నింపే చారిత్రక పథకం ప్రారంభోత్సవానికి దళితదండు కదిలివచ్చింది. పల్లె పట్టణం అనేతేడా లేకుండా.. నియోజకవర్గం నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి ఓ సమ్మక్క జాతరకు పోయినట్టు.. పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్టు పిల్లాజెల్లతోకలిసి ఉప్పెనలా తరలివచ్చింది. సభలో సంబురాల దండోరా మోగించింది.
దళిత బంధు పథకం అమలులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దు. ఇది కార్యక్రమం కాదు. ఉద్యమం లెక్క సాగాలి. ప్రతి కుటుంబానికీ పథకం అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తం. మొదట నిరుపేదలకు ఇస్తం. మళ్ల రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.అందరూ ఒకటే ఉపాధి మార్గం ఎంచుకోవద్దు. ఊరంతా ట్రాక్టర్లే కొంటే గిరాకీ ఉంటదా..? మీరే ఆలోచించి అడుగులేయాలి. అభివృద్ధి సాధించాలి.నేను అధికారంలో ఉంటా పోత. కానీ పథకాలు ఎప్పటికీ అమలు కావాలి. అందరూ అభివృద్ధి చెందాలి. దేశ చరిత్రలో ఎక్కడా లేని పథకం దళితబంధు. దీనిని చూసి మిగతా రాష్ర్టాల్లో ఉద్యమాలు మొదలుకావాలె. అన్ని దళిత కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలె. దేశానికి రోల్ మోడల్ కావాలె.