ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష
కోరుట్ల, డిసెంబర్ 15: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పడితే సహించేది లేదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై నియోజకవర్గంలోని రైస్ మిల్లర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీల చైర్మన్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంతమంది వ్యాపారులు అవకతవకలను పాల్పడుతూ, తాలు, తప్ప పేరుతో రైతుల నుంచి ఎక్కువ తరుగుతో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని పలువురు సింగిల్ విండో చైర్మన్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యం తూకం వేసి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు మానవత్వంతో వ్యవహరించాలని, రైతుల బాధలను అర్థం చేసుకోవాలని చెప్పారు. రైతులు, రైస్ మిల్లర్లతో చర్చించి సామరస్యపూర్వక వాతావరణంలో కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ధాన్యం లోడ్ వచ్చిన వెంటనే రైస్ మిల్లులో దించే విధంగా చర్యలు చేపట్టాలని, తూకంలో మోసాలు, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, డీసీఎస్వో చంద్రకుమార్, డీసీవో రామానుజాచార్యులు, మార్కెటింగ్ డీపీఎం మల్లేశ్, డీఎంసీఎస్ రజినీకాంత్, తహసీల్దార్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.