వెల్గటూర్/పెగడపల్లి/గొల్లపల్లి, డిసెంబర్ 15 : మూడో అదనపు టీఎంసీ నీటి తరలింపునకు గాను చేపడుతున్న కాళేశ్వరం లింక్-2 పనులు జూన్ 2022 వరకు పూర్తి చేయాలని, దీనికి సంబంధించి భూసేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చేపట్టి, రైతులకు పరిహారం అందించాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల, పెగడపల్లి మండలం నామాపూర్, దేవికొండ, గొల్లపల్లి మండలం చందోలిలో చేపడుతున్న కాళేశ్వరం లింక్ -2 పనులను బుధవారం ప్రాజెక్టు ఈఎన్సీ ఎన్.వెంకటేశ్వర్లు, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లు జీ రవి, కర్ణన్, అనురాగ్ జయంతితో కలిసి ఆమె పరిశీలించారు. మొదట జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు వచ్చిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. లింక్-2 పనులు మొదలయ్యే స్థలం కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌లో బోట్లో అధికారులతో కలిసి ప్రయాణిస్తూ, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు మ్యాప్‌ను చూపిస్తూ పనుల వివరాలను వివరించారు. అనంతరం పెద్ద వాగు పైన నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. అక్కడ నుంచి సర్జిపూల్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు, టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం మెఘా కంపెనీ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చందోలిలో పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసి జూన్ వరకు పూర్తి చేసి ఖరీఫ్‌కు నీరందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పైపులు తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు. పనుల్లో జరుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పెగడపల్లి మండలం నామాపూర్, దేవికొండ గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించి పంపు హౌస్, పైప్ లైన్ పనులు, విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం, అండర్ టన్నెల్ పనులు వేగంగా చేపట్టాలని, 2022 జూన్ నాటికి పనులు పూర్తి చేసి, డ్రై రన్ చేపట్టాలని సూచించారు.
దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తి స్థాయిలో చేపట్టాలని, పరిహారానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, నిర్వాసితులకు పరిహారం అందించి, ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టాలని ప్రాజెక్టు అధికారులు, మెఘా కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈసందర్భంగా అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గర్మీ అగర్వాల్, ఆర్డీవో మాధురి, ఇంజినీరింగ్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఈఈలు శ్రీధర్, నూనె శ్రీనివాస్, డీఈలు రాంప్రదీప్, నర్సింహారావు, విష్ణు, తహసీల్దార్లు నవీన్‌కుమార్, రాజేందర్, కృష్ణ చైతన్య, సర్పంచులు రవీందర్, నక్క మౌనిక రవితేజ, బోడకుంటి రమేశ్, మేర్గు మురళి, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి సత్యం, మెఘా కంపెనీ ప్రతినిధులు బ్రహ్మ య్య, నగేశ్, జనార్దన్, నాగేశ్వర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ పదిరె నారాయణరావు, ఈవో మారుతిరావు, మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ శ్వేత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.