
శంకరపట్నం, డిసెంబర్ 15: రుణాల మంజూరులో బ్యాంకర్లు ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (జేఎంఎల్‌బీసీ) సమావేశం యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాధిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో సహకరించాలని బ్యాంక్ ప్రతినిధులను కోరారు. ఎస్‌హెచ్‌జీ లింకేజీలో ముందుండాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల వ్యాపారాలను ప్రోత్సహించాలని చెప్పారు. ముద్ర రుణాల్లో శిశు విభాగంలో రూ.50 వేలు, కిశోర్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ అడుగకుండా రుణాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అలాగే పంట రుణాలను ప్రతీ రైతుకూ ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులదేనన్నారు. సురక్షా జీవిత బీమా పథకం, పీఎంజేబీవై, తదితర పథకాలపై మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులకు అపోహలు తొలగించి దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులదేనని చెప్పారు. రుణమాఫీపై రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు. ప్రతీ బ్యాంక్ లక్ష్యం చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. అలాగే పలువురు బ్యాంకుల ప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం అనంత్, ఆర్సెటీ డైరెక్టర్ దత్తాత్రి, సెర్ఫ్ డీపీఎం నర్సింహులు, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ ఎంపీడీవోలు, ఏవోలు, బ్యాంకుల ప్రతినిధులు, ఎంపీవోలు, ఐకేపీ ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.