స్వశక్తితో రాణిస్తున్న శాయంపేట మహిళలు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు
చెక గానుగతో నాణ్యమైన ఉత్పత్తులు
పొరుగు జిల్లాలకూ ఎగుమతులు
జమ్మికుంట రూరల్, నవంబర్ 15;సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ ఉండదనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఆ నలుగురు అతివలు. కుటీర పరిశ్రమ నెలకొల్పి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ఔత్సాహికులకు ఆదర్శంగా మారారు. నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల మన్ననలు పొందుతూనే స్వశక్తితో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
మహిళా స్వావలంబన కోసం జమ్మికుంట మండల పరిధిలోని శాయంపేటలో 2005 సంవత్సరంలో ధనలక్ష్మి గ్రామైక్య సంఘం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో మొత్తం 37 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో ఆదర్శ, అనూహ్య, రుద్రమ సంఘాల సభ్యులు సుంకరి జ్యోతి, సుంకిశాల స్వరూప, అకినపల్లి పద్మ, రాజేశ్వరి ఆర్థికంగా ఎదిగేందుకు ఒకటయ్యారు. 2019 ఆగస్టు 27న గ్రామీణాభివృద్ధి సంస్థ చేయూతతో అభయాంజనేయ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఉత్పత్తులు ప్రారంభించారు. ఇందులో పోషకాలతో కూడిన స్వచ్ఛమైన పల్లి, నువ్వులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు గింజలు చెక గానుగతో మర ఆడించి నూనె, పిండి మర ఆడిస్తూ పసుపు, కారం లాంటివి విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
కేవీకే సహకారం.. ప్రగతికి దోహదం
జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి అందించిన సాంకేతిక సహకారంతో జ్యోతి, స్వరూప, రాజేశ్వరి, పద్మ తమ ప్రగతికి బాటలు వేసుకున్నారు. ఆమె సూచన మేరకు నూనె గానుగ, పిండి మరతో ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిక్షణ సైతం పొందారు. రూ.3 లక్షల వ్యయంతో గుజరాత్ రాష్ట్రంలో చెక గానుగ, కోరుట్లలో పిండి మర, వరంగల్‌లో కారం పొడి, పసుపు యంత్రాలను కొనుగోలు చేశారు. అభయాంజనేయ ఫుడ్ ప్రాసెసింగ్ పేరిట గ్రామంలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్ హుజూరాబాద్ స్టాళ్లలో నూనె విక్రయాలు జరుపుతున్నారు. రెండుసార్లు ఆదిలాబాద్‌లో ఉత్తమ విక్రయదారులుగా డ్రీమ్ సొసైటీ అధ్యక్షురాలు సమతారెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ఆరోగ్యం.. ఆదాయం
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ఉత్పత్తుల్లో నిర్ణీత ప్రమాణాలతో నాణ్యత పాటిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల లీటర్ల పల్లి, రెండు వేల లీటర్ల కొబ్బరి, నాలుగు వేల లీటర్ల నువ్వుల, 100 లీటర్ల సన్‌ఫ్లవర్ నూనెను తయారుచేసి విక్రయించారు. నూనెతో పాటు మూడు క్వింటాళ్ల పసుపును వినియోగదారులకు సరఫరా చేశారు. ఇలా ఉన్న ఊరిలోనే ఏటా సుమారు లక్ష రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.
ఎంతో సంతృప్తినిస్తున్నది
మా కుటుంబాలకు అండగా ఉండాలని ఆలోచించాం. ఈ క్రమంలో నలుగురం కలిసి మహిళా సంఘం నుంచి రుణం తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నం. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మా కాళ్లపై మేం నిలబడడం ఎంతో సంతృప్తినిస్తున్నది.
-సుంకిశాల స్వరూప, శాయంపేట