రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
నూతన భవనాల పరిశీలన
ఫర్టిలైజర్ సిటీ, జనవరి 14: గోదావరిఖనిలో నిర్మిస్తున్న పోలీస్ విశ్రాంతి భవనం, వన్ టౌన్ పోలీస్ బిల్డింగ్‌లను ప్రారంభానికి సిద్ధం చేయాలనీ, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సూచించారు. గోదావరిఖనిలో నిర్మిస్తున్న పోలీస్ విశ్రాంతి భవనం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాలను రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. భవన నిర్మాణాల తీరును పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనుల గురించి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కలిసి ఈ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. చిన్న చిన్న పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని గుత్తేదారుతోపాటు పోలీస్ హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ఏసీపీ గిరి ప్రసాద్, వన్ టౌన్ సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్, శ్రీనివాస్, ఈఈ విశ్వనాథం, డీఈ సాయిచంద్, ఏఈ వినయ్, పోలీస్ అధికారులు ఉన్నారు.