కమాన్ చౌరస్తా, జనవరి 14;సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, సకల సౌభాగ్యాల పండుగ. శుక్రవారం భోగితో మొదలైంది. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి కాగా, శనివారం పండుగను ఘనంగా జరుపుకునేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది.
భోగి వేడుకలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి భోగి మంటలు వేసుకొని మంగళస్నానాలాచరించి దైవ దర్శనం చేసుకున్నారు. మహిళలు తమ వాకిళ్లను రంగుల లోగిళ్లుగా మార్చారు. గొబ్బెమ్మలు పెట్టి పూలు, పండ్లు పోశారు. పిల్లలకు భోగి పండ్లు పోశారు. అకడకడా బొమ్మల కొలువులు నిర్వహించారు. ముతె్తైదువులను ఆహ్వానించి నోములు, పసుపు, కుంకుమలు వాయినాలుగా పంచుకున్నారు. పలుచోట్ల గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేసి సందడి చేశారు. పెద్దపల్లిలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మొదటిసారి భోగి వేడుకలను నిర్వహించారు. స్థానిక జెండా చౌరస్తా వద్ద జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై భోగి మంటలను వెలిగించారు. గోదావరిఖని చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భోగి మంటలు వెలిగించారు.