
ఈసారి రూ.11.22లక్షల ఆదాయం
గతం కంటే రూ.4.80లక్షలు అధికం
కార్పొరేషన్/ముకరంపుర, డిసెంబర్ 13: కరీంనగర్ శివారులోని రేకుర్తి సమ్మక్క-సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలకు సోమవారం వేలం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16నుంచి 19వరకు జాతర జరగనుంది. స్థానిక 18వ డివిజన్లోని మున్సిపల్ కార్యాలయంలో వేలం ప్రక్రియ చేపట్టారు. 18, 19వ డివిజన్ కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఏదుల్ల రాజశేఖర్, జాతర వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్, జాతర ఈవో రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వేలంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఈవో వేలానికి సంబంధించిన నిబంధనలు వివరించారు. బెల్లం (బంగారం), కొబ్బరికాయలు, లడ్డూ-పులిహోర ప్రసాదం, తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడానికి టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. గత జాతర కంటే అధిక ధర పాడిన వారికి దుకాణాలు కేటాయించారు. బెల్లం విక్రయానికి రూ.5.12లక్షలు, కొబ్బరికాయలకు రూ.2.43 లక్షలు, లడ్డూ, పులిహోరకు రూ.1.58లక్షలకు పాడి దక్కించుకున్నారు. తల నీలాలకు రూ.1.61లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడానికి రూ.48వేలకు పాడారు. గత జాతరలో దుకాణాల వేలం ద్వారా రూ.6.41లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.11.22లక్షలు సమకూరింది. గతంతో పోల్చితే అదనంగా రూ.4.80లక్షల ఆదాయం వచ్చింది. వేలం అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు స మ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.