
మానకొండూర్, డిసెంబర్ 13 : కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతు ఉద్యమనేత, ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పచ్చునూర్ గ్రామంలో రైతుసంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్‌ను పొందుతున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ సంస్కరణ బిల్లు గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతుధర లభించేలా ప్రభుత్వాలు చట్టం తీసుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం బాయిల్డ్ బియ్యాన్ని కొనబోమని స్పష్టం చేయడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు యాసంగి సాగుపై అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆపకపోతే క్రాప్ హాలీడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఆన్నదాతలకు భరోసా కల్పించాలని కోరారు. క్రాప్‌హాలీడే ప్రకటించి ప్రతిఫలంగా ఎకరాకు రూ. 20వేల చొప్పున రైతుఖాతాల్లో జమచేయాలన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీలకు వంద రోజుల పనికాలం కోసం ఒక్కొక్కరి ఖాతాలో రూ. 40 వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గోపు మధుసూదన్‌రెడ్డి, మల్లగల్ల నగేశ్, కసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చలిగాని సత్యనారాయణ, గోపు నర్సింహారెడ్డి, వంగల హనుమంతు, నన్నవేని లక్ష్మయ్య, పిన్నింటి సుధాకర్‌రెడ్డి, బైక రాజమౌళి, మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి, దేవేందర్‌రావు, రంజిత్‌రావు, ప్రవీణ్ పాల్గొన్నారు.