పాలకుర్తి, ఆగస్టు 12: బసంత్‌నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. గురువారం జనరల్షిఫ్టులో కార్మికులు విధులు బహిష్కరించి, గేటు ఎదుట రెండు గంటలకుపైగా ధర్నా చేశారు. ఐదేండ్లుగా గ్రేడ్లు, స్కిల్ అప్‌గ్రేడేషన్, బేసిక్ పదోన్నతి కల్పించడం లేదంటూ వారు ఆందోళనకు దిగారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రతి సారి గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది 35 మందికి బేసిక్ పదోన్నతి, 90 మందికి రేట్లు పెంచాలని గతంలో అగ్రిమెంటు చేసుకున్నారు. ప్రస్తుత యూనియన్ ఏకమొత్తంలో 150 మంది కార్మికులకు గ్రేడ్లు, రేట్ల కోసం డిమాండ్ చేయడం తో ఐదేండ్లుగా పనులు జరుగక, కాలయాపన అవుతున్నది. దీంతో విసిగిపోయిన కార్మికులు గుర్తింపు సంఘం ప్రధానకార్యదర్శి ఎల్లంకిరాజయ్యతో పదవికి రాజీనామా చేయించి, సత్వరం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు కౌశిక హరి, ముల్కల కొమురయ్య, కాంగ్రెస్ నాయకుడు సూర సమ్మయ్య కార్మికుల ధర్నాకు మద్దతు పలికారు. ఈ నెల 28వ తేదీన కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వేస్తామని, ఆ లోగా స్కిల్ అప్‌గ్రేడేషన్, బేసిక్ పదోన్నతి కల్పిస్తామని, యాజమాన్యం తరఫున హెచ్ఆర్ మేనేజర్ గోవిందరావు, కార్మికులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు శాం తించారు. ఎస్ఐ మహేందర్ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.