జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పనుల పరిశీలన
మంథని టౌన్, డిసెంబర్ 11: మంథని పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. పట్టణంలోని బొక్కలవాగుపై వంతెన నిర్మాణ పనులు మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి శనివారం మధూకర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే అంబేద్కర్ చెరువు, రావుల చెరువు, తమ్మ చెరువులను సైతం మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు కట్టలపై చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, పట్టణంలోని చెరువు కట్టలను సుందరీకరించి మంథనికి కొత్త శోభను తీసుకు వస్తామన్నారు. ఆయన వెంట ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు కాయితీ సమ్మయ్య, శ్రీపతి బానయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, కో-ఆప్షన్ సభ్యుడు ఎస్కే యాకుబ్, టీఆర్ఎస్ నాయకులు నక్క శంకర్, పాపారావు పాల్గొన్నారు.
బాధితులకు అండగా..
బాధితులకు అండగా సీఎం సహాయ నిధి నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్ మధూకర్ పేర్కొన్నారు. రామగిరి మండలం బేగంపేటకు చెం దిన మాతంగి రాజ్‌కుమార్‌కు అనారోగ్యానికి గురై ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం జడ్పీ చైర్మన్‌ను సంప్రదించారు. మధూకర్ ప్రత్యేక శ్రద్ధతో బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 45,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంథనిలోని ఆయన నివాసంలో రాజ్‌కుమార్‌కు మధూకర్ పంపిణీ చేశారు.