సిరిసిల్ల టౌన్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసనగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో నేడు చేపడుతున్న రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల-వేములవాడ బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నా సభా స్థలం ఏర్పాట్లను గురువారం స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ ధర్నాలో పాల్గొననున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పాల్గొని మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మున్సిపల్ పరిధిలోని రైతులందరినీ భారీ సంఖ్యలో సభకు తరలించాలని నాయకులకు మార్గనిర్దేశం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఒజ్జల అగ్గిరాములు, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, పట్టణ ఉపాధ్యక్షుడు కొమిరె సంజీవ్గౌడ్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, తదితర నాయకులు పాల్గొన్నారు.