పెద్దపల్లి జిల్లాలో ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు
రాజీవ్ రహదారిపైనే 24 డేంజర్ జోన్లు
నియంత్రణకు పోలీస్ శాఖ కసరత్తు
ప్రమాద సూచికల ఏర్పాట్లు
వాహనదారులు జాగ్రత్తగా నడుపాలి
సీపీ చంద్రశేఖర్ రెడ్డి సూచన
పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లిలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ దృష్టిపెట్టింది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎక్కువగా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో పరిశీలిస్తున్నది. ఆ ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించింది. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రహదారులపై 30 బ్లాక్స్పాట్లు ఉన్నట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద వాహన దారులు తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరమైన చోట్ల సర్వీసు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ సంస్థకు ప్రతిపాదనలు చేశారు. హైవేపై ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటేందుకు వీలు లేకుండా సెంటర్ మీడియన్‌ను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రహదారిపై నిర్ణీత దూరంలో జీబ్రా క్రాసింగ్ పెట్టి రోడ్డు దాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైవేపై ఉన్న దాబాల వైపు నుంచి వాహనాల రాకపోకలతో రోడ్లపై మట్టి చేరుకొని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన పోలీసు శాఖ ఆ తరహా ప్రమాదాలను నివారించేందుకు ఏర్పాట్లు చేసే పనిలో పడింది.
పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లు ఇవే..
పెద్దపల్లి జిల్లాలో 30 బ్లాక్ స్పాట్లను తరచూ ప్రమాదాలు జరిగేవిగా గుర్తించారు. ఇందులో ధర్మారం మండలంలోని ఎన్‌హెచ్-7 ఎర్రంగుంటపల్లి, మల్లాపూర్లను, రాజీవ్హ్రదారి స్టేట్ హైవేపై సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి, గర్రెపల్లి, నర్సయ్యపల్లి, కాట్నపల్లి, పూసాల క్రాస్‌రోడ్డు, సుల్తానాబాద్, సుగ్లాంపల్లి, నారాయణపూర్ క్రాస్ రోడ్డు, చిన్నకల్వల, పెద్దకల్వల స్టేజీ, రంగంపల్లి పెట్రోల్‌బంక్ ఏరియా, పెద్దపల్లి బస్టాండ్, బంధంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి, అప్పన్నపేట బస్టాండ్ ఏరియా, కుంధన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఐఓసీ, మల్యాలపల్లి సబ్‌స్టేషన్ ఏరియా, బీగెస్ట్ హౌజ్, బంగ్లాస్ ఏరియా, లేబర్‌గేట్ ఎన్టీపీసీ, మేడిపల్లి సెంటర్, పీటీఎస్ గేట్, ఎఫ్‌సీఐ క్రాస్రోడ్డులను గుర్తించారు. పాలకుర్తి మండలం బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సబితం, రాఘవాపూర్, మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్లాస్పూర్ చెక్‌పోస్ట్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, గోదావరిఖని 1వన్‌టౌన్ పరిధిలోని రాజేశ్ థియేటర్ ఏరియాలను గుర్తించారు.
బ్లాక్స్పాట్ల వద్ద జాగ్రత్తగా ప్రయాణించాలి
జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించాం. జిల్లాలో రాజీవ్ రహదారిపై 24బ్లాక్ స్పాట్లను, ఎన్‌హెచ్-7పై 2 బ్లాక్స్పాట్లను, ఇతర ప్రధాన రహదారులపై మరో నాలుగు ఏరియాలను గుర్తించాం. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులను సైతం పెట్టాం. ఇంకా ఎక్కడైతే రోడ్లు బాగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయో వాటి మరమ్మత్తులను సైతం చేయిస్తున్నాం. ప్రయాణాలు చేసే టప్పుడే వాహన చోదకులు ఆచితూచి వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలను నియంత్రించవచ్చు. వాహనాలను నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.