ఎస్సారెస్పీ భూమిని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఒక చోట 9 గుంటలు, మరోచోట రెండున్నర గుంటలు కబ్జా చేయడంతో పాటు మరోచోట ఎకరం భూమికి ఎసరు పెట్టారు. అంతే కాకుండా, కబ్జా చేసిన భూమిలో ఓ చోట ఇంటి నిర్మాణానికి సైతం పూనుకున్నారు. అప్రమత్తమైన అధికారులు నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పినా పట్టించుకోకపోవడమే కాకుండా, అధికారులనే భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి, మే 3(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని క్యాంపు, కాలువలు నాలుగు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేవి. 2022 వరకు జగిత్యాల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్యాంపు పరిధిలో ధర్మారం క్యాంపు ఉండేది. 1978లో ఇక్కడ 1.26 ఎకరాల భూమికి అవార్డు పాస్ కాగా ప్రభుత్వం భూమిని సేకరించింది. ఇందుకు గాను నిర్వాసితులకు ప్రభుత్వం అప్పుడు రూ.2,329 పరిహారం అందజేసింది. కానీ, రెవెన్యూ అధికారులు సేకరించిన భూమిని రెవెన్యూ రికార్డుల్లోంచి తొలగించలేదు. భూములను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయ గా.. అప్పటి నిర్వాసితులకు సంబంధించిన వారి పేరున ఆన్లైన్లో కనిపించింది.
ఇది చూసిన ఒక ప్రజాప్రతినిధి వారికి కొంత ముట్టజెప్పి అక్రమాలకు తెర తీశారు. ఇలా సర్వే నంబర్ 297లోని 9 గుంటల ప్రభుత్వ భూమిని ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండానే 2023లో అమరపెల్లి లస్మమ్మ, ఆమె కొడుకులు అమరపెల్లి లచ్చయ్య, మల్లేశం అది ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ అదే గ్రామానికి చెందిన దేవి పద్మకు విక్రయించారు. ఆ తర్వాత ఆమె అదే గ్రామానికి చెందిన యాంసానికి మహేశ్‌కు విక్రయించింది. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే ఆ భూమి ఇద్దరి పేర్లు మారి మూడో వ్యక్తి పేరిట రిజిస్టర్ అయ్యింది.
అదే విధంగా, ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం పురాతన భవనానికి సంబంధించిన రెండున్నర గుంటల భూమిని స్థానికులు కబ్జా చేశారు. గ్రామానికి చెందిన వంగేటి సత్యారెడ్డి శిథిల భవనాన్ని కూల్చి ఆస్థానంలో నూతన భవనాన్ని నిర్మిస్తుండగా, గుర్తించిన ఎస్సారెస్పీ అధికారులు ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని సూచించారు. అయినా, వారు వినిపించుకోలేదు. ఇలా ఒకే మండలంలో రెండు ఆస్తులు కబ్జా కావడంతో ఎస్సారెస్పీ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
మరో ఎకరానికి ఎసరు.. కబ్జా కాకుండా నోటీసు బోర్డులు
మరో ఎకరం భూమిని సైతం కబ్జాకు యత్నించడంతో ఎస్సారెస్పీ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి తోడు ఆ స్థలంలో ఇది ఎస్సారెస్పీ స్థలం అని నోటీసు బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. ఒక వైపు కబ్జాకు గురైన భూమిలో చేపడుతున్న నిర్మాణాల విషయంలో తహసీల్దార్, పోలీసులను ఆశ్రయిస్తూనే నోటీసులు సైతం జారీ చేశారు.
నిర్మాణానికి అనుమతి రద్దు
సర్వే నంబర్ 297లోని ఎస్సారెస్పీకి చెందిన 9 గుంటల భూమిలో నిర్మాణం కోసం కబ్జాదారులు గతంలో తీసుకున్న అనుమతులను గ్రామ పంచాయతీ రద్దు చేసింది. ఈ భూమికి సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్లు సమర్పించడంతో 2023 సెప్టెంబర్ 9న గ్రామ పంచాయతీ యాంసాని మధు, మనోజ్‌కు నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకు న్న ఎస్సారెస్పీ అధికారులు పూర్తిస్థాయి మ్యాపులు, వివరాలను తెప్పించుకొని, ఆ భూమి తమదేనని పూర్తిగా నిర్ధారించి గ్రామ పంచాయతీకి ఒక లేఖను రాసింది. దీంతో అనుమతులను 2025 ఏప్రిల్ 19న రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు
రెండు చోట్ల ఎస్సారెస్పీ భూముల కబ్జా కావడంపై అధికారులు ధర్మారం పోలీసు స్టేషన్లో గత నెల 23న వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమ్మేవారికి, కొన్న వారికి ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినా రికార్డులను తారు మారు చేసి ప్రభుత్వ ఆస్తులను కాజేయాలనే కుట్రతో అమరపెల్లి లస్మమ్మ, ఆమె కొడుకులు లచ్చయ్య, మల్లేశం, దేవి పద్మ, ఆమె భర్త దేవి జనార్ధన్, యాంసాని మహేశ్, ఆయన కుమారులు యాంసాని మధు, మనోజ్ కబ్జా చేశారని వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మరోచోట వంగేటి సత్యారెడ్డి భూమి ఆక్రమించాడని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అదే రోజు మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి పది రోజులైనా ఇంకా చర్యలు చేపట్టలేదు. ఈ విషయమై ధర్మారం ఎస్ఐ శీలం లక్ష్మణ్‌ను వివరణ కోరగా రెండు విషయాల్లో తమకు ఫిర్యాదులు అందాయని, విచారణ చేస్తున్నామని, పూర్తి విచారణ తర్వాత చర్యలు చేపడుతామన్నారు.