ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దపల్లి, జయశంకర్ జడ్పీ అధ్యక్షులు
పెద్దపల్లిలో ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్
ఎక్స్అఫీషియో ఓటుకు దూరంగా ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పెద్దపల్లి, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ)/మంథని టౌన్/మంథని రూరల్/పెద్దపల్లి జంక్షన్/పెద్దపల్లి రూరల్: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. పెద్దపల్లి, మంథనిలో పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహించారు. మం థని పోలింగ్ కేంద్రంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లిలో ఎక్స్అఫీషియో సభ్యులు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనిల్‌కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి ఓటు వేశారు. పెద్దపల్లి పోలిం గ్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు రామగుండం కార్పొరేటర్ మహంకాళీ స్వామి తొలి ఓటు వేయగా, మంథని పోలింగ్ కేంద్రంలో మల్హర్ మండలం తాడిచర్ల-2 ఎంపీటీసీ మల్క కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
పెద్దపల్లి పోలింగ్ కేంద్రాన్ని సీఈసీ శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించిన జిల్లా అధికారులను అభినందించారు. ఆయన వెంట కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్, ఎన్నికల ఏఆర్వో లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎన్నికల అధికారి ప్రవీణ్, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐలు ప్రదీప్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, మంథని పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, మంథని ఇన్చార్జి ఆర్డీవో నరసింహమూర్తి, తహసీల్దార్ ప్రకాశ్, సీఐ సతీశ్, ఎస్ఐ చంద్రకుమార్ పర్యవేక్షించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న నిరక్షరాస్య ఎంపీటీసీ మంథని పోలింగ్ కేంద్రంలో కంపేనియన్(సహాయకుడి)తో నాగెపల్లికి చెందిన ఎంపీటీసీ రాంబాయి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కొడుకు మధు సహకారంతో వెళ్లి ఓటు వేశారు.
వినియోగించుకున్నది వీరే..
ఎన్నికల్లో 304 ప్రజాప్రతినిధులు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 306 ఓట్లకుగానూ 304 మంది ఓటు వేయడంతో 99.34 శాతం పోలింగ్ నమోదైంది. మంథనిలో 98.97, పెద్దపల్లిలో 99.51 శాతం ఓటింగ్ నమోదైంది. మంథనిలో 98 మంది ఓటర్లకు గానూ 97 మంది ఓటర్లు హక్కు వినియోగించుకోగా ఎక్స్అఫీషియోగా ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఓటు వేయలేదు. మంథనిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 13 మంది కౌన్సిలర్లు, 9 మంది ఎంపీపీలు, 9 మంది జడ్పీటీసీలు, 66 మంది ఎంపీటీసీలు ఓటు వేశారు.
పెద్దపల్లిలో 208 మంది ఓటర్లకు గానూ 207 మంది హక్కును వినియోగించుకోగా వీరిలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు ఎక్స్అఫీషియోలుగా 2, అలాగే 49 మంది కార్పొరేటర్లు, 9 మంది జడ్పీటీసీలు, 51 మంది కౌన్సిలర్లు, 96 మంది ఎంపీటీసీలు ఓటు వేశారు. పెద్దపల్లి మం డలం రంగాపూర్ ఎంపీటీసీ మహేందర్ తన హక్కు వినియోగించుకోలేదు. మంథనిలో ఉన్న శ్రీధర్‌బాబు ఓటు హక్కు వినియోగించుకోక పోవడంపై విస్మయం వ్యక్తమవుతుంది. రంగాపూర్ ఎంపీటీసీ మహేందర్ పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఉన్నా ఓటు వేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.