ఉప ఎన్నికలో ఆపార్టీకి గుణపాఠం చెప్పండి
సంక్షేమ ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలవండి
రానున్న రోజుల్లో సొంతిల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం
పెంచిన ధరలు దించినంకనే బీజేపోళ్లు ఓట్లడగాలె
నల్ల చట్టాలను రద్దు చేస్తామని మోడీతో చెప్పించాలె
ఇల్లందకుంట మండల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్, అక్టోబర్ 9:పేదలను దంచుడు.. పెద్దలకు పంచుడు ఇదే బీజేపీ విధానం. పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో పేదలను అరిగోసపెడుతున్నది. వ్యవసాయ బావుల వద్ద మోటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నది. ధరలు పెంచుతున్న బీజేపీని పాతరేయండి. పోలింగ్‌నాడు సిలిండర్‌కు దండం పెట్టి బయలుదేరండి. ఓటుతో బుద్ధి చెప్పండి. అసలు బీజేపోళ్లకు ఓట్లడిగే హక్కే లేదు. పెంచిన ధరలు దించినకంకనే ఓట్లడగాలె. నల్లచట్టాలను రద్దు చేస్తామని మోడీతో చెప్పించాలె. అప్పుడే ఊళ్లకు రావాలె. ఇన్నాళ్లు ఈటల చేసిందేమీ లేదు. మరోసారి అవకాశం వచ్చినా ఏమీ చేయడు. తన ఆస్తులు పెంచుకోవడానికి, పెంచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయం చేస్తున్నడు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రూ. 7500 కోట్ల రైతుబంధు సాయం చేసింది. ఈటల రాజేందర్ ఇచ్చే క్వార్టర్ బాటిల్ కావాలో.. సీఎం కేసీఆర్ తెచ్చే కాళేశ్వరం నీళ్లు కావాలో మీరే ఆలోచించుకోవాలి.
అడ్డగోలు ధరలు పెంచుతున్న బీజేపీని పాతరేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్కు అండగా నిలువాలని, ఈటల ఇచ్చే క్వార్టర్ బాటిల్ కావాల్నో.. సీఎం కేసీఆర్ తెచ్చే కాళేశ్వరం నీళ్లు కావాల్నో తేల్చుకోవాలని సూచించా రు. శనివారం ఇల్లందకుంట మండలంలోని వంతడ్పుల, పాతర్లపల్లి, లక్ష్మాజీపల్లి, బుజూనూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహిం చగా, ప్రజలు, యువకులు అడుగడుగునా పూల వర్షం కురిపిం చారు. గెల్లు అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వంతడ్పుల, పాతర్లపల్లిలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నదని, రాష్ట్రంలో మాత్రం సంక్షోభంలోనూ కల్యాణ లక్ష్మి, రైతుబంధు, ఆసరా పింఛన్లు కొనసాగిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా తొలుత దళితులతోనే ప్రారంభించామని గుర్తు చేశారు. దళితబంధు లాగే రానున్న రోజుల్లో పేదలందరినీ ఆదుకుంటామని భరోసానిచ్చారు. కరోనా సంక్షోభంలోనూ రూ. 7500 కోట్లు రైతుబంధు సాయం ఆపకుండా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
24 గంటల కరంట్, రైతుబంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, ఆసరాలాంటి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే, బీజేపీ ఏం ఇస్తున్నదో ఆలోచించుకోవాలన్నారు. ఈటల రాజేందర్ ఇచ్చే బొట్టుబిళ్ల, టోపీలు, గడియారాలు, ఛత్రీలు, కుట్టుమిషన్లతో మన సమస్యలు తీరయన్నారు. రైతు వ్యతిరేకిగా మారిన బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి అవకాశమని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజ య్ పాతర్లపల్లిలో రూపాయి పనిచేసిండా? అని ప్రశ్నించారు. కుట్రలతో గెలవాలని ఈటల చూస్తున్నడని, 60 మందితో నామినేషన్లు వేయించిండని మండిపడ్డారు. ఈ నెల 30న ఓటు వేసే ముందు ఒకసారి గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకొని బయల్దేరాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దీవించి పంపిన గెల్లుకు ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ పావనీ వెంకటేశ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, సర్పంచులు దిలీప్‌రెడ్డి, రాంమల్లయ్య, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, తిరుపతి, శ్రీపాల్‌రెడ్డి, భిక్షపతి, రాజిరెడ్డి, పెద్ది కుమార్, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.
సోడా వాలా.. శాలువా సన్మానం
హుజూరాబాద్ పట్టణంలో సిటీ ప్యాలెస్‌లో చాయ్ తాగుతున్న మంత్రి హరీశ్‌రావును చూసి, ఆ పకనే ఉన్న సోడా బండి వ్యాపారి బట్టల షాప్‌కి వెళ్లి శాలువా తెచ్చాడు. సిటీ ప్యాలెస్ నుంచి తిరిగి వస్తున్న మంత్రి హరీశ్‌రావును చూసి ‘హరీశ్ అన్న.. హరీశ్ అన్న’ అని పిలిచి, తన సోడా బండి వద్దకు తీసుకువెళ్లి శాలువాతో సన్మానించాడు. సోడా బండి వ్యాపారి అభిమానం చూసి, మంత్రి ముగ్ధులయ్యారు. ఒక నాయకునికి ఇంత కంటే ఎం కావాలని మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.