రూ. 3016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరితో కలిసి స్కూటీలు, ట్రైసైకిళ్లు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ
పెద్దపల్లి రూరల్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సమైక్యపాలనలో వారికి ఒరిగిందేంలేదని విమర్శించారు. దేశంలోనే ఎక్కడాలే నివిధంగా దివ్యాంగులకు రూ. 3016 పింఛన్ ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. అంతేకాకుండా వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఆదివారం దివ్యాంగులకు స్కూటీలు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి ఎమ్మెల్యే దాసరి, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ పూలబొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలోని 114 మందికి రూ. 60 కోట్ల విలువచేసే సహాయ ఉపకరణాలు మంజూరు కాగా, 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ దేశంలోనే ఆదర్శపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ మంత్రి కొప్పుల సహకారంతో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కొప్పులకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవూఫ్‌ఖాన్, పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ బానోతు శంకర్‌నాయక్, వైస్ చైర్మన్ జడల సురేందర్, మార్కెట్ కార్యదర్శి దేవిరాజ్ పృథ్వీరాజ్, సీడీపీవోలు కవిత, స్వరూప, పద్మశ్రీ, సూపర్వైజర్లు జమున, సృజన, పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.