ఒకేరోజు రూ.3,71,520 వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీల చెల్లింపు
మెట్పల్లి రూరల్, జనవరి 9: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులందరూ ఒకేరోజు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు చెల్లించారు. గత ఆరేళ్లుగా ఒకేరోజు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు చెల్లిస్తూ మిగతా గ్రామాల అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్థానిక ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ చార్జీ చెల్లించేందుకు తీర్మానం చేసుకున్నారు. 2021 సంవత్సరానికి గాను రూ. 360 చొప్పున 1032 పంపుసెట్లకు చెందిన విద్యుత్ సర్వీస్చార్జి రూ.3,71,520 చెల్లించాలని తీర్మానించుకొని, సంబంధిత మొత్తాన్ని ట్రాన్స్కో రూరల్ ఏఈ ప్రదీప్కుమార్కు చెల్లించారు. ఒకేదఫాలో సర్వీస్ చార్జీలు చెల్లించి తమకు సహకరించిన రైతులకు ఈ సందర్భంగా ట్రాన్స్కో ఏఈ కృతజ్ఞతలు తెలిపారు.