పెద్దపల్లి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో 2620 వైన్స్‌లు ఉండగా ఇందులో గౌడ కులస్తులకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 షాపులు కేటాయించారు. ఈ లెక్కన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 290 వైన్స్‌లు ఉండగా, గౌడ కులస్తులకు 53, ఎస్సీలకు 30 వైన్స్‌లు కేటాయించారు. ఎస్టీలకు కేటాయించలేదు. మిగతా 207 జనరల్‌గా ప్రకటించారు. వీటికి త్వరలో టెండర్ ప్రక్రియను చేపట్టనున్నారు.
మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ఖరారు చేసి షాపులను కేటాయించింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత వైన్ షాపుల లైసెన్స్ ముగియనుండడంతో వైన్ షాపుల రిజర్వేషన్ల ప్రక్రియను పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. జిల్లాలో 77 దుకాణాలకు గౌడ కులస్తులకు (15శాతం) 13, ఎస్సీలకు (10 శాతం) 8 దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయించారు. గెజిట్ సీరియల్ నెంబర్ 8, 9, 17, 21, 27, 29, 44, 52, 55, 57, 60, 64, 76 గౌడ కులస్తులకు, గెజిట్ సీరియల్ నెంబర్ 4, 10, 24, 25, 45, 46, 49, 67 ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన 56 మద్యం దుకాణాలకు ఆసక్తి ఉన్న అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరావత్తు
ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మద్యం దుకాణాల లైస్సెన్స్కు అర్హత ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నాన్ రిఫండబుల్ రూ.2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాలి.
పెద్దపల్లి జిల్లాలో 77 షాపులు
పెద్దపల్లి జిల్లాలో 77 మద్యం దుకాణాలకు లైస్సెన్స్ ఇవ్వాలని అధికారులకు నిర్ణయించారు. పెద్దపల్లి సర్కిల్ పరిధిలో 20, సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో 15, రామగుండం సర్కిల్ పరిధిలో 27, మంథని సర్కిల్ పరిధిలో 15 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో గెజిట్ నెంబర్ 1 నుంచి 20 వరకు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో, 21 నుంచి 35 వరకు సుల్తానాబాద్ పరిధిలో, 36 నుంచి 62 వరకు రామగుండం సర్కిల్ పరిధిలో, 63 నుంచి 77 వరకు మంథని సర్కిల్ పరిధిలో ఉన్నాయి.
రిజర్వేషన్
పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని సర్కిల్ పరిధిలో రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి సర్కిల్ పరిధిలో గెజిట్ నెంబర్ 4, 10 (పెద్దపల్లి పట్టణం) ఎస్సీలకు, 8, 9 (పెద్దపల్లి టౌన్), 17 (జూలపల్లి) గౌడ కులస్తులకు కేటాయించారు.
సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని గెజిట్ నెంబర్ 21 (సుల్తానాబాద్ టౌన్), 27 (కాల్వ శ్రీరాంపూర్) , 29 (ఓదెల) గౌడకులస్తులకు, 24 (సుల్తానాబాద్ టౌన్), 25 (పూసాల) ఎస్సీలకు కేటాయించారు.
రామగుండం సర్కిల్ పరిధిలోని గెజిట్ నెంబర్ 44 (గంగానగర్, బస్‌స్టాండ్ ఏరియా), 52, 55 (పైవీైంక్లెన్), 57 (యైటిైంక్లెన్ కాలనీ), 60 (పాలకుర్తి) గౌడ కులస్తులకు, 45, 46 (మార్కండేయ కాలనీ, అడ్డగుంటపల్లి), 49 (లక్ష్మినగర్, కల్యాణ్‌నగర్, మార్కెట్ ఏరియా) ఎస్సీలకు కేటాయించారు.
మంథని సర్కిల్ పరిధిలో గెజిట్ నంబర్ 64 (మంథని టౌన్), 76 (ముత్తారం) గౌడ కులస్తులకు, 67 (మంథని టౌన్) ఎస్సీలకు కేటాయించారు.