కెనాల్ పనులను త్వరగా పూర్తిచేస్తాం
భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తాం
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
19.04 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన
56 మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ధర్మారం, నవంబర్ 8: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, కర్షకులకు అండగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. శనివారం ధర్మారంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి, ముందుగా పత్తిపాక, బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 19.04 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ డీ83/బీ 1ఎల్ కాల్వకు అనుబంధంగా 3 కొత్త ఉప కాల్వల నిర్మాణాలకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపల్లిలో రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణంతో ఆయకట్టేతర గ్రామాల రైతుల దశాబ్దాల కల నెరవేరిందని చెప్పారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా ఇక్కడి రైతుల బాధను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సాగు నీటి సమస్య కు శాశ్వత పరిష్కారం దొరికిందని వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలోని సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు వెల్లడించారు. దీనికి తోడు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అపరభగీరథుడిలా కొత్త ప్రాజెక్టు నిర్మించి కోటి 20 లక్షల ఎకరాలకు నీరందించినట్లు వివరించా రు. బొమ్మారెడ్డిపల్లి, పత్తిపాక, కొత్తపల్లి గ్రామాల రైతుల భూములకు నీరందించేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాలువలను త్వరగా నిర్మించి 1,052 ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేద ఇంటి లో వెలుగులు నింపుతున్నామని మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో 56 మంది లబ్ధిదారులకు 56,06,496 విలువైన చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాలలో ఎస్సారెస్పీ ఎస్ ఈ సత్యరాజ చంద్ర, ఈఈ ప్రసాద్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, సర్పంచులు సుజాత, లావణ్య, వరలక్ష్మి, ప్రేమలతా రెడ్డి, లలిత, ఎంపీటీసీలు అజయ్‌పాల్ రెడ్డి, గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, ఉప సర్పంచులు, వార్డు సభ్యు లు, విండో డైరెక్టర్లు, విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, తాసిల్దార్ ఆర్ వెంకట లక్ష్మి, ఎంపీడీవో బీ జయశీల, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఏఎంసీ తాజా మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ రాజయ్య, జిల్లా సభ్యుడు బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు శ్రీనివాస్, కనకలక్ష్మి, నళినీకాంత్, స్వామి, మల్లేశం, ఎండీ హఫీజ్, ధర్మారం పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతి రావు ఉన్నారు.