కార్పొరేషన్, నవంబర్ 7: నగరంలోని శివారు కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 59, 28, 53, 18, 34 డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, పారుల అభివృద్ధి, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. శివారు కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చట్టపరంగా వచ్చే 33 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శివారు కాలనీల్లో మంచినీటి సరఫరాను మెరుగుపరిచేందుకు రూ. 5 కోట్లతో కొత్త పైపులైన్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో ఎల్ఈడీ వీధి దీపాలు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలం ఉన్న చోట పారులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్‌సిటీ నిధులతో వివిధ ప్రాజెక్టుల కింద నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
సమ్మక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నగరంలోని రేకుర్తిలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మేయర్ వై సునీల్‌రావు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహించే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, జాతరలో బల్దియా ఆధ్వర్యంలో బారీకేడ్లు, మంచినీటి నల్లాలు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. జాతరకు నాలుగు నెలల సమయం ఉన్నందున వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు గందె మాధవీమహేశ్, నాంపెల్లి శ్రీనివాస్, శ్రీదేవి, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, షాకిరా అంజుమ్, నాయకులు బర్కత్‌అలీ, చంద్రమౌళి, సమ్మక్క జాతర వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.