అసత్య ప్రచారాలతో దళితబంధుపై కుట్ర
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాల్లేవ్..
సీఎం కేసీఆర్‌తోనే సమూల మార్పు సాధ్యం
జమ్మికుంట ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, అక్టోబర్ 7: దళితులు బాగుపడడం బీజేపీ నాయకుడు ఈటలకు నష్టం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు పరిధిలోని దళిత కాలనీ వాసులతో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దళిత బంధు వంటి గొప్ప పథకం మరొకటి లేదని కొనియాడారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దళిత జాతిలో 90 శాతం మంది నిరుపేదలేనని, అందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు పడ్డాయని, ఇప్పటికే యూనిట్ల ఎంపిక కూడా పూర్తయిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలతో దళితబంధుపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు ఇస్తున్న రూ.10లక్షలకు మరో రూ.10లక్షలు కేంద్రంలోని బీజేపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనును గెలిపించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, తదితరులున్నారు.