కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు
చలికి వణుకుతున్న వృద్ధురాలిని చేరదీసిన మిషన్ స్మైల్
పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఘటన
పెద్దపల్లిటౌన్, జనవరి 7: నవ మాసాలు మోసి..కనిపెంచిన వృద్ధురాలైన తల్లిని నడిరాత్రి వేళ నడిరోడ్డుపై వదిలేశారు కర్కోటక కోడుకులు..మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలో వెలుగుచూసింది. చలిలో గజగజ వణుకుతున్న వృద్ధురాలిని మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ బాధ్యులు చేరదీశారు. అరటి పండ్లు అందించి కడుపు నింపారు. వివరాలు.. గురువారం రాత్రి 11గంటలకు పెద్దపల్లి కమాన్ రాజీవ్ రహదారిపై చలికి వణుకుతున్న ఓ వృద్ధురాలు మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ బాధ్యులు గుర్తించారు. ఆమెను వివరాలు అడగగా తన పేరు లక్ష్మీరాజమ్మ అని, తనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు చెప్పింది. కానీ ఊరు, కొడుకుల పేర్లు చెప్పలేదు. సఖీ కేంద్రం నిర్వాకులకు సమాచారం అందించగా సఖీ కేంద్రం కో-ఆర్డినేటర్ స్వప్న వాహనంలో తాత్కాలిక షెల్టర్‌లోకి తరలించారు. ఈ సందర్బంగా స్వప్న మాట్లాడుతూ మిషన్ స్మైల్ ఆరనైజేషన్ నిర్వాహకులు గంగిపల్లి విద్యాసాగర్, బత్తిని అనిల్, పూసాల అఖిల్, కాసిపాక ప్రశాంత్, ఆశిష్, డాక్టర్ అశోక్‌కుమార్ వృద్ధురాలిని చేరదీశారని చెప్పారు. డిసెంబర్ 29న మధురమ్మ అనే వృద్ధురాలిని సైతం కొడుకులు రోడ్డుపై వదిలివెళ్లారని, అధికారుల ఆదేశాల మేరకు కొడుకుల ఆచూకీ తెలుసుకొని వారికి అప్పగించారని చెప్పారు. ఇలా అభాగ్యులకు అండగా నిలుస్తున్న వారికి చేయూతనందిస్తున్న మిషన్ స్మైల్ బాధ్యులను స్వప్న అభినందించారు.