మరణించిన ఆరుగురికి ప్రమాద బీమా మంజూరు
మంత్రి కేటీఆర్ చొరవతో ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు
సిరిసిల్ల, జనవరి 7: ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నది. కష్టకాలంలో ప్రమాద బీమా అందిస్తూ భరోసానిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆరుగురు కార్యకర్తల కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల చొప్పున మంజూరు చేసింది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జిల్లాలో ఆరుగురు కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ తోట ఆగయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బేతి దేవయ్య, బేతి రామచంద్రం, గంభీరావుపేట మండలం రాజుపేటకు చెందిన కోడూరి చిన్నలింగం, గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కొమ్ము శ్రీనివాస్, వేములవాడ మండలం రుద్రారంకు చెందిన పాముల తిరుపతి, ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా కు చెందిన మాలోతు రమేశ్ మృతి చెందగా వారి కుటుంబాలకు రూ.2లక్షల ప్రమాద బీమా మంజూరైనట్లు తోట ఆగయ్య తెలిపారు.
ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి దేవయ్య(47) ముస్తాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య ఎల్లవ్వ కూతుర్లు రేఖ, లక్ష్మీ, కుమారుడు ఆంజనేయులు, రాము ఉన్నారు.
తెర్లుమద్దికి చెందిన బైతి రామచంద్రం(32) నవంబర్ 8 డిసెంబర్ 2020న కామారెడ్డి జిల్లా లక్ష్మీరావుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతడికి భార్య పద్మ, కుమారుడు హర్షవర్ధన్ ఉన్నాడు. గంభీరావుపేట మండలం రాజుపేటకు చెందిన కోడూరి చిన్న లింగం(58)కామారెడ్డి జిల్లా బీబీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించే క్రమంలో 18 అక్టోబర్ 2020న మృతి చెందాడు. ఆయనకు భార్య కళావతి, ఇద్దరు కూతుర్లు, కుమారుడు రాజు ఉన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కొమ్ము శ్రీనివాస్(39) ఎగువ మానేరు జలాశయంలో చేపలవేటకు వెళ్లి 24 సెప్టెంబర్ 2020న మరణించాడు. ఇతడికి భార్య శ్యామల, ఇద్దరు కుమారులు రాకేశ్, మేఘనాథ్ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాకు చెందన మాలోత్ రమేశ్ (31)గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు. ఇతడికి భార్య సునిత పిల్లలు హిమవర్షిణీ, వినోద్ ఉన్నారు. వేములవాడ మండలం రుద్రారానికి చెందిన పాముల తిరుపతి(38) గత ఏడాది వట్టెంల సమీపంలో మిషన్‌భగీరథలో కూలీ పని చేస్తుండగా అటుగా వెళ్తున్న వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు ఇతడికి భార్య ప్రతిభ, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరైనట్లు ఆగయ్య వెల్లడించారు.